నాగ్‌పూర్ : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ శతకం బాదాడు. 8 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ చేసిన రోహిత్‌కిది టెస్టులో మూడో సెంచరీ కాగా, నాలుగేళ్ల తర్వాత ఈ సెంచరీ చేయడం గమనార్హం. చివరగా 2013 నవంబర్‌లో ముంబై టెస్టులో వెస్టిండీస్‌పై 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు రోహిత్. మరో సెంచరీ చేసేందుకు రోహిత్‌కు నాలుగేళ్లు పట్టగా, ఈ మధ్య కాలంలో 7 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. విండీస్ పై కోల్‌కతాలో చేసిన 177 పరుగులే టెస్టుల్లో రోహిత్‌కు అత్యధిక వ్యక్తిగత స్కోరు.
మరోవైపు రోహిత్ సెంచరీ మార్కు చేరుకోగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత తొలి ఇన్నింగ్స్ ను 610/6 వద్ద డిక్లేర్ చేశాడు. దీంతో భారత్‌కు 405 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. లంక తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకే చాప చుట్టేసిన విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లలో కోహ్లీ డబుల్ సెంచరీ (267 బంతుల్లో 213 పరుగులు: 17 ఫోర్లు, 2 సిక్సర్లు) కి తోడు చతేశ్వర్ పుజారా (143), మురళీ విజయ్ (128), రోహిత్ (102 నాటౌట్) లు శతకాలతో చేలరేగడంతో భారత్ భారీ స్కోరు చేసి మ్యాచ్‌పై పట్టు సాధించింది.
ఆదిలోనే దెబ్బతీసిన ఇషాంత్
రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక జట్టును భారత బౌలర్ ఇషాంత్ ఆదిలోనే దెబ్బ తీశాడు. జట్టు ఖాతా తెరవకుండానే లంక ఓపెనర్ సమరవిక్రమ(0) ను ఇన్నింగ్స్ రెండో బంతికే ఇషాంత్ బౌల్డ్ చేశాడు. చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో ఇషాంద్ సంధించిన బంతిని సమరవిక్రమ అంచనా వేయలేకపోవడంతో బంతి ఆఫ్ స్టంప్‌ను ముద్దాడింది. మరో వికెట్ పడకుండా కరుణరత్నే(11), తిరిమన్నే (9) జాగ్రత్త పడ్డారు. మూడో రోజు ఆట నిలిపివేసే సమయానికి లంక జట్టు 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 21 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment