తీవ్ర అసహనానికి గురయ్యా: రోహిత్ శర్మ
ముంబై: గాయంతో ఆటకు దూరమైన ఐదు నెలలు తనకు ఎంతో భారంగా గడిచాయని భారత క్రికెటర్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. సహచరులు మైదానంలో చెలరేగుతుంటే తాను మాత్రం ప్రేక్షకుడిగా ఉండిపోవాల్సి వచ్చిందన్నాడు. పేరుకు ఐదు నెలలే అయినా చాలా సుదీర్ఘ సమయం గడిపినట్లనిపిస్తోందని తెలిపాడు. గాయం గురించి చాలా భయపడ్డానని, కానీ డాక్టర్లు చిన్న గాయమని దైర్యం ఇచ్చారని రోహిత్ అన్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ సమయంలో గాయపడిన తర్వాత జట్టంతా మైదానంలో ఉంటే నేను మాత్రం హోటల్లో కూర్చొని మ్యాచ్‌ను చూడాల్సి రావడం చాలా అసహనానికి గురిచేసిందన్నాడు. అయితే ఆటగాడికి గాయాలు సహజమని పేర్కొన్నాడు.
దీని వల్ల నా కెరీర్‌పై ఎలాంటి ప్రభావం ఉండదన్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకొని మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా అని రోహిత్ తెలిపాడు. గత ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ నిలకడైన ప్రదర్శన కనబర్చలేకపోయిందని, ఈసారి మంచి ఫలితాలు సాధిస్తామని జట్టు కెప్టెన్ రోహిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా తమ పేస్ బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉందని అతను వెల్లడించాడు. మా ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలమన్నాడు.
జట్టు కోచ్, దిగ్గజ క్రికెటర్ జయవర్ధనేతో కలిసి పని చేయడం చాలా బాగుందని చెప్పాడు. కొత్త తరహా ప్రణాళికలతో ఈసారి సన్నద్ధమయ్యామని. సొంత మైదానం వాంఖెడేలో అజేయంగా నిలిచి ఇతర వేదికల్లోనూ రాణిస్తే మాకు దూసుకెళ్లే అవకాశం ఉందని రోహిత్ విశ్లేషించాడు. న్యూజిలాండ్‌తో వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయంతో రోహిత్ ఇంగ్లండ్ టెస్టు, వన్డే సిరీస్‌లు, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు.