'ఫుట్సాల్'కు రొనాల్డిన్హో దూరం
పనాజీ: భారత్ లో జరుగుతున్న ప్రీమియర్ ఫుట్సాల్ లీగ్లో ఒక ఓటమి, ఒక గెలుపుతో ఉన్న గోవా-5 జట్టుకు బ్రెజిల్ స్టార్ ఆటగాడు రొనాల్డిన్హో దూరమయ్యాడు. త్వరలో బ్రెజిల్ లో జరిగే ఒలింపిక్స్ లో పారా ఒలింపిక్ కమిటీకి రొనాల్డినోను ఆ దేశం బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడంతో అతను ఫుట్ సాల్ ను వైదొలిగాడు.
గత ఆదివారం బెంగళూరుతో చెన్నైతో జరిగిన మ్యాచ్లో రొనాల్డినో ఐదు గోల్స్ చేసి గోవా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తాను ప్రీమియర్ ఫుట్సాల్ లీగ్లో గోవాకు ప్రాతినిథ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా.. తనకు దేశం అతి పెద్ద బాధ్యతను అప్పగించినందున దాన్ని నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉందన్నాడు.
'ఫుట్ సాల్ కు దూరం కావడం చాలా దురదృష్టం. నాకు దేశం ఒక బాధ్యతను అప్పగించింది. నన్ను పారా ఒలింపిక్ కమిటీ అంబాసిడర్ గా ప్రకటించింది. దీంతో వెళ్లక తప్పడం లేదు. గోవా జట్టుతో గడిపిన అతి కొద్ది రోజులు చాలా ఆహ్లాదంగా గడిచాయి. తరువాత సీజన్కు మరింత పటిష్టంగా వస్తా'అని రొనాల్డిన్హో తెలిపాడు. ఇటీవల ప్రీమియర్ ఫుట్ సాల్ లీగ్ అనేక వివాదాల నడుమ భారత్ లో ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ లీగ్ లో గ్రూప్ -బిలో ఉన్న గోవా మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రీమియర్ ఫుట్‌సాల్‌కు పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ లూయిస్ ఫిగో నేతృత్వం వహిస్తుండగా, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిండర్ గా వ్యవహరిస్తున్నాడు.