Ronaldinho
-
ఇద్దరు మొనగాళ్లు
డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. ప్లేయర్‌గా మంచి పేరుంది. చక్కటి భార్య. ముద్దులొలికే ఇద్దరు కూతుళ్లు. మూడేళ్ల కూతురు ఐవీ మే, రెండేళ్ల ఇండీ రే. చిన్న కుటుంబం. ఆ కుటుంబంలోకి ఇంకొకరు రాబోయీ, రాలేకపోయారు. అవును. వార్నర్ భార్య క్యాండైస్కు గర్భస్రావం అయింది! బాత్రూమ్కి వెళ్లినప్పుడు క్యాండైస్ ఆ సంగతి గమనించింది. ఏకబిగిన బ్లీడింగ్. వెంటనే రమ్మని భర్తను పిలిచింది. ఇద్దరూ బాత్రూమ్లోనే ఒకరిలో ఒకరు ఒదిగిపోయి ఏడ్చేశారు. వార్నర్ మహా సున్నితం. ప్రెస్ మీట్లో అతడి కన్నీళ్లను టీవీలో చూసి ఎంతోమంది కంటతడి పెట్టుకున్నారు. బాల్ ట్యాంపరింగ్ చేశాడని అతడిని దక్షిణాఫ్రికా టూర్లో ఉండగా ఆట మధ్యలో ఇంటికి పంపించేశారు. అక్కడి నుంచి తిరిగొచ్చాక సిడ్నీలో అతడు పెట్టిన ప్రెస్ మీట్ అది. ‘తప్పు చెయ్యకుండా ఉండాల్సింది’ అని ఆస్ట్రేలియన్లకు వార్నర్ క్షమాపణ చెప్పాడు. అది జరిగిన వారానికే క్యాండైస్కు గర్భస్రావం అయింది. అలా జరగడానికి ముందు వరకు భార్యాభర్తలిద్దరూ విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. మళ్లీ ఇలాంటి తప్పును జన్మలో జరగనివ్వకూడదని ఇద్దరూ ఒట్టు పెట్టుకున్నారు. ఒత్తిడి మాత్రం అలానే ఉండిపోయింది. ఆ ఒత్తిడి వాళ్ల మూడో బిడ్డను బలి తీసుకుంది. అసలు క్యాండైస్ ప్రెగ్నెంట్ అని తెలిగానే ఆ మూడో బిడ్డపై ఈ దంపతుల ప్రేమ మొదలైంది. చివరికి ప్రేమ మాత్రమే మిగిలి బిడ్డ దక్కకుండా పోయింది. దాంపత్యం అనేది అనురాగబంధం. కాబట్టి వాళ్లేం చెక్కుచెదర్లేదు. వాళ్లున్న ఇంటి గోడలపైనే కొద్దిగా మరకలు పడ్డాయి. వాటినిప్పుడు ఇద్దరూ కలిసి తుడిచేసుకునే పనిలో ఉన్నారు. ఆమె బకెట్‌తో నీళ్లు తెస్తే, ఆయన గుడ్డపెట్టి గోడల్ని వాష్ చేస్తాడు. కాలం ఆ గోడల తడిని, వీళ్ల కంటతడినీ రెండింటినీ తుడిచేస్తుంది. వాళ్లిద్దరి మధ్య ఉన్న అనురాగం కన్నా, ‘మళ్లీ తప్పు చేయకూడదు’ అని చేతిలో చెయ్యి వేసుకుని చెప్పుకున్న మాట మరింత బలమైనది. ఏ దాంపత్యాన్నైనా నిలబెట్టేది ఈ బలమే. మాట బలం! రోనాల్డీనో బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్లేయర్. ఒకేసారి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్‌ని ఒకే సమయానికి పెళ్లి చేసుకోబోతున్నాడని వార్త! ఈ ఏడాది జనవరిలో ఫుట్‌బాల్ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యాడు రోనాల్డీనో. ఆ విషయాన్ని అతడి సోదరుడు (ఏజెంట్ కూడా) అత్యంత నాటకీయంగా ప్రకటించాడు. ‘అతడు ఆపేశాడు. అయిపోయింది. రష్యా వరల్డ్ కప్ తర్వాత మనం మరింత అందమైన, సొగసైన పెద్ద ఈవెంట్‌ను బహుశా ఆగస్టులో చూడబోతున్నాం’ అన్నాడు. రష్యా వరల్డ్ కప్ జూన్‌లో మొదలై జూలైలో ముగుస్తుంది. అంటే మనం చూడబోతున్న సొగసైన వేడుక రోనాల్డీనో, ఇద్దరు వధువుల పెళ్లేనని అనుకోవాలి. రియోలో అతడికి ఐదు మిలియన్ పౌండ్ల (సుమారు నలభై ఐదున్నర కోట్ల రూపాయలు) విలువ చేసే సొంత భవంతి ఉంది. గత డిసెంబర్ నుంచీ ఈ ఇద్దరు అమ్మాయిలు ఆ భవంతిలో సఖ్యతగా ఉంటున్నారట. ఇంకా కొన్ని విశేషాలు కూడా బయటికి వచ్చాయి. సఖ్యంగా ఉన్నందుకు ఇద్దరికీ నెలకు పదిహేను వందల పౌండ్ల అలవెన్స్ ఇస్తుంటాడట రొనాల్డీనో! అంటే ఒక్కొక్కరికీ లక్షా ముప్పై వేల రూపాయలు. అంతేకాదు, ఏం తెచ్చినా ఇద్దరికీ ఒకేలాంటివి తెచ్చి ఇస్తుంటాడట. ఇటీవల కూడా విదేశాలకు వెళ్లినప్పుడు ఇద్దరికీ ఒకేలాంటి పెర్ఫ్యూమ్ని కానుకగా తెచ్చి ఇచ్చాడట. ఇందులో విశేషం ఏముందీ?! ఇలాంటి రిలేషన్స్‌లో ఉండే తిప్పలేగా ఇవన్నీ! అయితే ఒక విశేషం ఉంది. ఈ పెళ్లికి రొనాల్డీనో చెల్లెలు డైసీ వెళ్లడం లేదు!! బహుభార్యత్వాన్ని తను సమర్థించనని, అందుకే తన అన్న పెళ్లికి వెళ్లదలచుకోలేదని ఇంకా పెళ్లీడైనా రాని ఆ చిన్నారి ప్రకటించడం ఒక ముచ్చటైన విశేషం అయింది. వధువులిద్దరూ రాకపోయినా రొనాల్డీనో ఇంకొకర్ని చేసుకుంటాడేమో కానీ, పెళ్లికి చెల్లి రానంటే తిక్కవేషాలు వేస్తాడా! అందుకే కావచ్చు.. ‘ఇటీజ్ ద బిగ్ లై’ అని వెంటనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ మాత్రం హద్దుల్లో పెట్టేవాళ్లు ఇంట్లో ఒకరైనా ఉండాలి. తల్లైనా, చెల్లైనా, జీవన సహచరైనా. – మాధవ్ శింగరాజు -
ఇద్దర్నీ ఒకేసారి పెళ్లాడటం లేదు..
రియో డీ జనిరో : బ్రెజిల్ మాజీ ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డిన్హో ఒకేసారి ఇద్దరు మహిళలను వివాహం చేసుకోనున్నాడని వచ్చిన వార్తలను తోసిపుచ్చాడు. ఇది అతిపెద్ద అవాస్తవమని పేర్కొన్నాడు. రియో డీ జనిరోలోని తన నివాసంలో ఆగస్టులో రొనాల్డిన్హో (38) ఒకేసారి ఇద్దరు మగువలను పెళ్లాడనున్నాడని ఊహాగానాలు చెలరేగాయి. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్స్ ప్రిసిల్లా, బేట్రియాజ్లను రొనాల్డిన్హో వివాహం చేసుకుంటాడని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై రొనాల్డిన్హో సోదరి కినుక వహిస్తూ తాను వివాహానికి హాజరు కాబోనని చెప్పారు. ఇక ప్రిసిల్లా కుటుంబం కూడా వేరే కారణాలతో వీరి వివాహంపై సుముఖంగా లేరని కథనాలు వెలువడ్డాయి. ప్రిసిల్లాకు విలువైన బహుమతి ఇచ్చినప్పుడల్లా మరో యువతికి కూడా కానుకలిచ్చేవాడని వారు చెబుతున్నారు. ఇక బ్రెజిల్లో బహుభార్యత్వంపై నిషేధం ఉండటంతో రొనాల్డిన్హో ఈ వార్తలను తోసిపుచ్చాడని భావిస్తున్నారు. 1998లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన రోనాల్డిన్హో.. సొంత దేశం బ్రెజిల్ తరపున 97 మ్యాచ్‌లు ఆడి 33 గోల్స్ చేశాడు. 2002లో బ్రెజిల్‌కు వరల్డ్ కప్ దక్కటంలో రోనాల్డిన్హోదే కీలక పాత్ర. తర్వాత బార్సిలోనా తరపున 2003 నుంచి 2008 వరకు ఆడాడు. గతేడాది భారత్‌లో నిర్వహించిన ప్రీమియర్ ఫుట్ సాల్ లీగ్‌లో ఢిల్లీ డ్రాగన్స్ తరపున రోనాల్డిన్హో ఆడాడు. ఈ ఏడాది జనవరిలో సోదరుడి ద్వారా రోనాల్డిన్హో రిటైర్మెంట్ ప్రకటన చేయించాడు. -
ఒకేసారి ఇద్దరితో పెళ్లి
రియో డీ జనీరో: ఫుట్ బాల్ స్టార్ రోనాల్డిన్హో (38) ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను పెళ్లాడబోతున్నాడు. గత కొంతకాలంగా ప్రిసిల్లా కోఎల్హో, బియాట్రిజ్ సౌజా అనే ఇద్దరు యువతులతో రొనాల్డిన్హో డేటింగ్లో ఉన్నాడు. ప్రిసిల్లాతో కొన్నేళ్లుగా ప్రేమలో(2012 నుంచి) ఉన్న ఈ స్టార్ ప్లేయర్, బియాట్రిజ్తో మాత్రం 2016 నుంచి అఫైర్ కొనసాగిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ నుంచి వీరు ముగ్గురు ఒకే నివాసంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆగష్టులో ఈ ఫుట్‌బాల్ వీరుడు ఒకేసారి వారిద్దరిని వివాహం చేసుకోబోతున్నాడు. అయితే రోనాల్డిన్హో పద్ధతులు నచ్చని అతని సోదరి, తాను మాత్రం ఆ వివాహానికి హాజరుకాబోనని ప్రకటించారు. ఈ విషయాన్ని ఓ డియా అనే పత్రిక ప్రచురించింది. 1998లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల ఆరంగ్రేటం చేసిన రోనాల్డిన్హో.. సొంత దేశం బ్రెజిల్ తరపున 97 మ్యాచ్‌లు ఆడి 33 గోల్స్ చేశాడు. 2002లో బ్రెజిల్‌కు వరల్డ్ కప్ దక్కటంలో రోనాల్డిన్హోదే కీలక పాత్ర. తర్వాత బార్సిలోనా తరపున 2003 నుంచి 2008 వరకు ఆడాడు. గతేడాది భారత్‌లో నిర్వహించిన ప్రీమియర్ ఫుట్ సాల్ లీగ్‌లో ఢిల్లీ డ్రాగన్స్ తరపున రోనాల్డిన్హో ఆడాడు. ఈ ఏడాది జనవరిలో సోదరుడి ద్వారా రోనాల్డిన్హో రిటైర్మెంట్ ప్రకటన చేయించాడు. -
'ఫుట్సాల్'కు రొనాల్డిన్హో దూరం
పనాజీ: భారత్ లో జరుగుతున్న ప్రీమియర్ ఫుట్సాల్ లీగ్‌లో ఒక ఓటమి, ఒక గెలుపుతో ఉన్న గోవా-5 జట్టుకు బ్రెజిల్ స్టార్ ఆటగాడు రొనాల్డిన్హో దూరమయ్యాడు. త్వరలో బ్రెజిల్ లో జరిగే ఒలింపిక్స్ లో పారా ఒలింపిక్ కమిటీకి రొనాల్డినోను ఆ దేశం బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడంతో అతను ఫుట్ సాల్ ను వైదొలిగాడు. గత ఆదివారం బెంగళూరుతో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డినో ఐదు గోల్స్ చేసి గోవా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తాను ప్రీమియర్ ఫుట్సాల్ లీగ్‌లో గోవాకు ప్రాతినిథ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా.. తనకు దేశం అతి పెద్ద బాధ్యతను అప్పగించినందున దాన్ని నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉందన్నాడు. 'ఫుట్ సాల్ కు దూరం కావడం చాలా దురదృష్టం. నాకు దేశం ఒక బాధ్యతను అప్పగించింది. నన్ను పారా ఒలింపిక్ కమిటీ అంబాసిడర్ గా ప్రకటించింది. దీంతో వెళ్లక తప్పడం లేదు. గోవా జట్టుతో గడిపిన అతి కొద్ది రోజులు చాలా ఆహ్లాదంగా గడిచాయి. తరువాత సీజన్‌కు మరింత పటిష్టంగా వస్తా'అని రొనాల్డిన్హో తెలిపాడు. ఇటీవల ప్రీమియర్ ఫుట్ సాల్ లీగ్ అనేక వివాదాల నడుమ భారత్ లో ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ లీగ్ లో గ్రూప్ -బిలో ఉన్న గోవా మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రీమియర్ ఫుట్సాల్కు పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ లూయిస్ ఫిగో నేతృత్వం వహిస్తుండగా, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిండర్ గా వ్యవహరిస్తున్నాడు. -
లెజెండరీ ప్లేయర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
తిరువనంతపురం: బ్రెజిల్ లెజెండరీ ఫుట్ బాల్ క్రీడాకారుడు రోనాల్డినో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కేరళలో ఆయన కారులో వెళుతుండగా పనిచేయని ఓ ట్రాఫిక్ సిగ్నలింగ్ పోల్ అమాంతం పడిపోయింది. దీంతో కారు డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ చేశారు. లేదంటే అనూహ్య ప్రమాదం జరిగి ఉండేది. సోమవారం ఉదయం నడక్కావులోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగిన నాగ్ జీ ఇంటర్నేషనల్ క్లబ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రోనాల్డినో పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళుతుండగా ఒక్కసారిగా పనిచేయని సిగ్నలింగ్ పోల్ పడిపోయింది. రెండు సెకన్లు ఆలస్యంగా అది పడిపోయి ఉంటే ఏకంగా ఆయన కారుపైనే పడేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేరళ పర్యటనకు రోనాల్డినో ఆదివారం సాయంత్రం వచ్చిన విషయం తెలిసిందే. -
ప్రముఖ క్రీడాకారుడికి తృటిలో తప్పిన ప్రమాదం
రియోడి జనిరో: బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డిన్హో (35) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తన తల్లి పోర్టో అలిగ్రే పుట్టిన రోజు వేడుకల కోసం వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. అతను ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న గుంతలో పడిపోయింది. అది పెద్ద ప్రమాదమేనని, అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదని.. ఇది చాలా గొప్పవిషయమని రొనాల్డిన్హో ప్రతినిధి తెలిపారు. ప్రమాదం జరిగినపుడు అతడి వ్యక్తిగత డ్రైవరు కారు నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రొనాల్డిన్హో రెండుసార్లు అందుకున్నాడు బ్రెజిల్ స్టార్ ఆటగాడు రొనాల్డిన్హో. మెరుపు దాడులతో అనేకసార్లు జట్టుకు విజయాన్ని అందించిన ఘనత అతడి సొంతం.