డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. ప్లేయర్‌గా మంచి పేరుంది. చక్కటి భార్య. ముద్దులొలికే ఇద్దరు కూతుళ్లు. మూడేళ్ల కూతురు ఐవీ మే, రెండేళ్ల ఇండీ రే. చిన్న కుటుంబం. ఆ కుటుంబంలోకి ఇంకొకరు రాబోయీ, రాలేకపోయారు. అవును. వార్నర్ భార్య క్యాండైస్‌కు గర్భస్రావం అయింది! బాత్రూమ్‌కి వెళ్లినప్పుడు క్యాండైస్ ఆ సంగతి గమనించింది. ఏకబిగిన బ్లీడింగ్. వెంటనే రమ్మని భర్తను పిలిచింది. ఇద్దరూ బాత్రూమ్‌లోనే ఒకరిలో ఒకరు ఒదిగిపోయి ఏడ్చేశారు. వార్నర్ మహా సున్నితం. ప్రెస్ మీట్‌లో అతడి కన్నీళ్లను టీవీలో చూసి ఎంతోమంది కంటతడి పెట్టుకున్నారు. బాల్ ట్యాంపరింగ్ చేశాడని అతడిని దక్షిణాఫ్రికా టూర్‌లో ఉండగా ఆట మధ్యలో ఇంటికి పంపించేశారు. అక్కడి నుంచి తిరిగొచ్చాక సిడ్నీలో అతడు పెట్టిన ప్రెస్ మీట్ అది. ‘తప్పు చెయ్యకుండా ఉండాల్సింది’ అని ఆస్ట్రేలియన్‌లకు వార్నర్ క్షమాపణ చెప్పాడు. అది జరిగిన వారానికే క్యాండైస్‌కు గర్భస్రావం అయింది. అలా జరగడానికి ముందు వరకు భార్యాభర్తలిద్దరూ విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. మళ్లీ ఇలాంటి తప్పును జన్మలో జరగనివ్వకూడదని ఇద్దరూ ఒట్టు పెట్టుకున్నారు. ఒత్తిడి మాత్రం అలానే ఉండిపోయింది. ఆ ఒత్తిడి వాళ్ల మూడో బిడ్డను బలి తీసుకుంది. అసలు క్యాండైస్ ప్రెగ్నెంట్ అని తెలిగానే ఆ మూడో బిడ్డపై ఈ దంపతుల ప్రేమ మొదలైంది. చివరికి ప్రేమ మాత్రమే మిగిలి బిడ్డ దక్కకుండా పోయింది. దాంపత్యం అనేది అనురాగబంధం. కాబట్టి వాళ్లేం చెక్కుచెదర్లేదు. వాళ్లున్న ఇంటి గోడలపైనే కొద్దిగా మరకలు పడ్డాయి. వాటినిప్పుడు ఇద్దరూ కలిసి తుడిచేసుకునే పనిలో ఉన్నారు. ఆమె బకెట్‌తో నీళ్లు తెస్తే, ఆయన గుడ్డపెట్టి గోడల్ని వాష్ చేస్తాడు. కాలం ఆ గోడల తడిని, వీళ్ల కంటతడినీ రెండింటినీ తుడిచేస్తుంది. వాళ్లిద్దరి మధ్య ఉన్న అనురాగం కన్నా, ‘మళ్లీ తప్పు చేయకూడదు’ అని చేతిలో చెయ్యి వేసుకుని చెప్పుకున్న మాట మరింత బలమైనది. ఏ దాంపత్యాన్నైనా నిలబెట్టేది ఈ బలమే. మాట బలం!
రోనాల్డీనో బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్లేయర్. ఒకేసారి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్‌ని ఒకే సమయానికి పెళ్లి చేసుకోబోతున్నాడని వార్త! ఈ ఏడాది జనవరిలో ఫుట్‌బాల్ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యాడు రోనాల్డీనో. ఆ విషయాన్ని అతడి సోదరుడు (ఏజెంట్ కూడా) అత్యంత నాటకీయంగా ప్రకటించాడు. ‘అతడు ఆపేశాడు. అయిపోయింది. రష్యా వరల్డ్ కప్ తర్వాత మనం మరింత అందమైన, సొగసైన పెద్ద ఈవెంట్‌ను బహుశా ఆగస్టులో చూడబోతున్నాం’ అన్నాడు. రష్యా వరల్డ్ కప్ జూన్‌లో మొదలై జూలైలో ముగుస్తుంది. అంటే మనం చూడబోతున్న సొగసైన వేడుక రోనాల్డీనో, ఇద్దరు వధువుల పెళ్లేనని అనుకోవాలి. రియోలో అతడికి ఐదు మిలియన్ పౌండ్ల (సుమారు నలభై ఐదున్నర కోట్ల రూపాయలు) విలువ చేసే సొంత భవంతి ఉంది. గత డిసెంబర్ నుంచీ ఈ ఇద్దరు అమ్మాయిలు ఆ భవంతిలో సఖ్యతగా ఉంటున్నారట. ఇంకా కొన్ని విశేషాలు కూడా బయటికి వచ్చాయి. సఖ్యంగా ఉన్నందుకు ఇద్దరికీ నెలకు పదిహేను వందల పౌండ్ల అలవెన్స్ ఇస్తుంటాడట రొనాల్డీనో! అంటే ఒక్కొక్కరికీ లక్షా ముప్పై వేల రూపాయలు. అంతేకాదు, ఏం తెచ్చినా ఇద్దరికీ ఒకేలాంటివి తెచ్చి ఇస్తుంటాడట. ఇటీవల కూడా విదేశాలకు వెళ్లినప్పుడు ఇద్దరికీ ఒకేలాంటి పెర్‌ఫ్యూమ్‌ని కానుకగా తెచ్చి ఇచ్చాడట. ఇందులో విశేషం ఏముందీ?! ఇలాంటి రిలేషన్స్‌లో ఉండే తిప్పలేగా ఇవన్నీ! అయితే ఒక విశేషం ఉంది. ఈ పెళ్లికి రొనాల్డీనో చెల్లెలు డైసీ వెళ్లడం లేదు!! బహుభార్యత్వాన్ని తను సమర్థించనని, అందుకే తన అన్న పెళ్లికి వెళ్లదలచుకోలేదని ఇంకా పెళ్లీడైనా రాని ఆ చిన్నారి ప్రకటించడం ఒక ముచ్చటైన విశేషం అయింది. వధువులిద్దరూ రాకపోయినా రొనాల్డీనో ఇంకొకర్ని చేసుకుంటాడేమో కానీ, పెళ్లికి చెల్లి రానంటే తిక్కవేషాలు వేస్తాడా! అందుకే కావచ్చు.. ‘ఇటీజ్ ద బిగ్ లై’ అని వెంటనే స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ మాత్రం హద్దుల్లో పెట్టేవాళ్లు ఇంట్లో ఒకరైనా ఉండాలి. తల్లైనా, చెల్లైనా, జీవన సహచరైనా.
– మాధవ్ శింగరాజు
ఇద్దరు మొనగాళ్లు
Published Sat, May 26 2018 12:19 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment