బిగ్‌బాష్ లీగ్ 2024-25 ఆడుతున్న ఆసీస్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్.. హోబర్ట్ హరికేన్స్‌తో ఇవాళ (జనవరి 10) జరుగుతున్న మ్యాచ్‌లో తన బ్యాట్‌తో తనే కొట్టుకున్నాడు.
అసలేం జరిగిందంటే.. హరికేన్స్‌తో మ్యాచ్‌లో సిడ్నీ థండర్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను రిలే మెరిడిత్ బౌలింగ్ చేశాడు. వార్నర్ స్ట్రయిక్‌లో ఉన్నాడు. తొలి బంతిని మెరిడిత్ డ్రైవ్ చేసే విధంగా ఆఫ్ స్టంప్ ఆవల బౌల్ చేశాడు. ఈ బాల్‌ను వార్నర్ మిడ్ ఆఫ్ దిశగా డ్రైవ్ చేశాడు.
అయితే వార్నర్‌కు ఊహించిన ఫలితం రాలేదు. బౌలర్ స్పీడ్ ధాటికో ఏమో కాని డ్రైవ్ షాట్ ఆడగానే వార్నర్ బ్యాట్ హ్యాండిల్ దగ్గర విరిగిపోయింది. క్రికెట్‌లో ఇలా జరగడం సాధారణమే. ఇక్కడే ఓ ట్విస్ట్ నెలకొంది. బ్యాట్ విరగగానే రెండో భాగం కాస్త వార్నర్ తల వెనుక భాగాన్ని తాకింది.
అదృష్టవశాత్తు హెల్మెట్ ధరించినందుకు గాను వార్నర్‌కు ఏమీ కాలేదు. ఇలా జరగ్గానే వార్నర్ గట్టి అరిచాడు. కామెంటేటర్లు సరదాగా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలలో వైరలవుతుంది.
David Warner's bat broke and he's hit himself in the head with it 🤣#BBL14 pic.twitter.com/6g4lp47CSu
— KFC Big Bash League (@BBL) January 10, 2025
మ్యాచ్ విషయానికొస్తే.. కొత్త బ్యాట్ తీసుకున్న తర్వాత వార్నర్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో చాలా జాగ్రత్తగా ఆడిన వార్నర్ చివరి వరకు క్రీజ్‌లో నిలిచాడు. వార్నర్ అజేయ హాఫ్ సెంచరీ సాధించడంతో సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
వార్నర్ 66 బంతుల్లో 7 బౌండరీల సాయంతో 88 పరుగులు చేశాడు. థండర్ ఇన్నింగ్స్‌ను వార్నర్ ఒక్కడే నడిపించాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. సామ్ బిల్లింగ్స్ (15 బంతుల్లో 28; 4 ఫోర్లు), ఒలివర్ డేవిస్ (17 బంతుల్లో 17; ఫోర్) కాసేపు క్రీజ్‌లో నిలబడ్డారు. థండర్ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు.
భారీగా బిల్డప్ ఇచ్చిన సామ్ కొన్‌స్టాస్ 9 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. మాథ్యూ గిల్కెస్ 7 బంతుల్లో 9, క్రిస్ గ్రీన్ 7 బంతుల్లో 8 పరుగులు చేశారు. అసిస్టెంట్ కోచ్ కమ్ ప్లేయర్ అయిన డేనియల్ క్రిస్టియన్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌటయ్యాడు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టాన్‌లేక్, క్రిస్ జోర్డన్, నిఖిల్ చౌదరీ తలో వికెట్ దక్కించుకున్నారు.
భీకర ఫామ్‌లో వార్నర్
ఈ సీజన్‌లో సిడ్నీ థండర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. వార్నర్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 316 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
ఈ సీజన్‌లో వార్నర్ స్కోర్లు..
7 (5)
17 (10)
19 (15)
86 నాటౌట్ (57)
49 (33)
50 (36)
88 నాటౌట్ (66)
టాప్‌లో థండర్
ప్రస్తుత బీబీఎల్ సీజన్‌లో సిడ్నీ థండర్ అద్భుత విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్‌లో ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు (9 పాయింట్లు) సాధించింది. రెండింట ఓడిపోగా, ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
పాయింట్ల పట్టికలో థండర్ తర్వాతి స్థానాల్లో సిడ్నీ సిక్సర్స్ (9 పాయింట్లు), హోబర్ట్ హరికేన్స్ (9), బ్రిస్బేన్ హీట్ (7), పెర్త్ స్కార్చర్స్ (6), మెల్‌బోర్న్ రెనెగేడ్స్ (6), మెల్‌బోర్న్ స్టార్స్ (6), అడిలైడ్ స్ట్రయికర్స్ (4) ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment