కెప్టెన్గా జో రూట్?
ముంబై:ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ క్రికెట్ తరపున అత్యధిక టెస్టు మ్యాచ్లకు సారథ్యం వహించిన ఘనతను సొంతం చేసుకున్న అలెస్టర్ కుక్.. తాను సారథిగా ఉండేది ఇక అతి తక్కువ మ్యాచ్లనే సంకేతాలిచ్చాడు. భారత్ తో జరిగిన నాల్గో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైన తరువాత కుక్ తన మనసులోని మాటను మరోసారి వెల్లడించాడు.
దాదాపు భారత్ తో చెన్నైలో జరిగే ఐదో టెస్టు మ్యాచే తనకు కెప్టెన్గా చివరదనే విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. దానిలో భాగంగానే సహచర స్టార్ ఆటగాడు జో రూట్ను కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలంటూ పేర్కొన్నాడు. తమ భవిష్య కెప్టెన్ రూట్ అంటూ కుక్ పేర్కొన్నాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో కెప్టెన్ గా వ్యవహరించిన రూట్.. ప్రతీ ఒక్కరికీ అత్యంత గౌరవం ఇచ్చే ఆటగాడని కొనియాడాడు. తాను మ్యాచ్ గెలిచినా, ఓడినా ముందుగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడతానన్నాడు. అయితే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ తో చర్చించిన తరువాత తుది నిర్ణయాన్ని తెలుపుతానన్నాడు.
2012లో ఇంగ్లండ్ జట్టుకు కుక్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అదే ఏడాది భారత్ తో జరిగిన టెస్టు సిరీస్ ను ఇంగ్లండ్ 2-1 తో గెలుచుకుంది. ఇప్పటివరకూ కుక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 24 టెస్టులను గెలిచింది. అదే క్రమంలో రెండు యాషెస్ సిరీస్లను కూడా ఇంగ్లండ్ జట్టు కుక్ సారథ్యంలో సొంతం చేసుకుంది. 2006లో భారత్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ టెస్టు కెరీర్ను ఆరంభించిన కుక్.. అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పటివరకూ 135 టెస్టులు ఆడిన కుక్.. 10, 688 పరుగులను సాధించి ఈ ఫార్మాట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.
దాంతో పాటు అత్యంత వేగంగా ఎనిమిది వేల టెస్టు పరుగులను, పది వేల పరుగులను నమోదు చేసిన ఘనతను కుక్ సొంతం చేసుకున్నాడు. తద్వారా భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కుక్ అధిగమించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల ద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు (135) ఆడిన ఆటగాడిగా అలెక్ స్టివార్ట్ (133 మ్యాచ్‌లు) రికార్డును కుక్ అధిగమించాడు.