ఆకాశ్‌ దెబ్బ కొట్టినా... ఇంగ్లండ్‌ 'రూట్' మారింది | The first day of the fourth Test was interesting | Sakshi
Sakshi News home page

ఆకాశ్‌ దెబ్బ కొట్టినా... ఇంగ్లండ్‌ 'రూట్' మారింది

Published Sat, Feb 24 2024 1:59 AM | Last Updated on Sat, Feb 24 2024 1:59 AM

The first day of the fourth Test was interesting - Sakshi

అరంగేట్ర బౌలర్‌ ఆకాశ్‌ దీప్‌ పేస్‌కు... అశ్విన్, జడేజా స్పిన్‌కు... లంచ్‌ లోపే ఇంగ్లండ్‌ కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయింది . దాంతో టీ విరామం వరకు ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు  తెర పడుతుందేమోననే సందేహం కలిగింది... కానీ అలా జరగలేదు. అనుభవజ్ఞుడైన జో రూట్‌ తన అసలు సిసలు ఆటతీరును  ప్రదర్శించాడు...

ఈ సిరీస్‌లో తమ జట్టు దూకుడైన ‘బజ్‌బాల్‌’ వ్యూహానికి భిన్నంగా ‘రూట్‌’ మార్చాడు... సంయమనంతో ఆడుతూ ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు...  సహచరుడు ఫోక్స్‌ సహాయంతో రెండో సెషన్‌లో భారత బౌలర్లను కాచుకున్నాడు ...ఆ తర్వాత ఫోక్స్‌ వెనుదిరిగినా...  రాబిన్సన్‌ అండగా నిలబడటంతో... రూట్‌ పట్టుదలతో ఆడుతూ వీరోచిత సెంచరీతో  ఇంగ్లండ్‌ స్కోరును 300 దాటించాడు.   

రాంచీ: సిరీస్‌ గెలిచేందుకు భారత్‌... సమం చేసేందుకు ఇంగ్లండ్‌... ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య మొదలైన నాలుగో టెస్టు తొలిరోజు ఆట ఆసక్తికరంగా సాగింది. కొత్త పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ (3/70) నిప్పులు చెరిగే బౌలింగ్‌ భారత్‌ను మురిపిస్తే... సీనియర్‌ బ్యాటర్‌ జో రూట్‌ (226 బంతుల్లో 106 బ్యాటింగ్‌; 9 ఫోర్లు) అజేయ శతకం ఇంగ్లండ్‌ను కుప్పకూలకుండా కాపాడింది. దీంతో పూర్తిగా ఎవరి పైచేయి లేకుండా తొలిరోజు ఆట సమఉజ్జీగా ముగిసింది.

టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 7 వికెట్లకు 302 పరుగులు చేసింది. ఓపెనర్‌ క్రాలీ (42 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్‌), మిడిలార్డర్‌లో బెన్‌ ఫోక్స్‌ (126 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడారు. ఆకాశ్‌ దీప్‌ 3 వికెట్లు తీయగా.. సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌ చెరో వికెట్‌ తీశారు.  

‘టాప్‌’లేపిన ఆకాశ్‌ 
ఈ సిరీస్‌లో భారత్‌ తరఫున నాలుగో ఆటగాడిగా అరంగేట్రం చేసిన ఆకాశ్‌ దీప్‌ తన పేస్‌తో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ ఐదో బంతికి క్రాలీని ఆకాశ్‌ దీప్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కానీ అది నోబాల్‌ కావడంతో ఆకాశ్‌ దీప్‌కు నిరాశ తప్పలేదు. ఆ తర్వాత క్రాలీ దూకుడు పెంచాడు. సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో క్రాలీ చెలరేగిపోయాడు. వరుసగా 4,4,4,6తో అదరగొట్టాడు. సాఫీగా సాగిపోతున్న ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను ఆకాశ్‌ దీప్‌ దెబ్బ కొట్టాడు.

పదో ఓవర్లో ఆకాశ్‌    రెండో బంతికి ఓపెనర్‌ డకెట్‌ (11)ను, నాలుగో బంతికి వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒలీ పోప్‌ (0)లను అవుట్‌ చేసి భారత శిబిరాన్ని సంబరంలో ముంచాడు. ఇదే జోరుతో తన మరుసటి ఓవర్లో (ఇన్నింగ్స్‌ 12వ) ఓపెనర్‌ క్రాలీని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 47/0తో ఉన్న ఇంగ్లండ్‌ ఆకాశ్‌ దెబ్బకు 57/3 స్కోరు వద్ద టాపార్డర్‌ను కోల్పోయింది.

ఈ దశలో జో రూట్‌కు జతయిన బెయిర్‌స్టో (35 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్‌) భారత బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగాడు. దీంతో  వన్డేను తలపించేలా 20వ ఓవర్లోనే ఇంగ్లండ్‌ స్కోరు 100కు చేరింది. రెండో సెషన్‌ ఆరంభంలో బెయిర్‌స్టోను అశ్విన్‌ ఎల్బీగా పంపాడు. అంపైర్‌ తోసిపుచ్చినా... రివ్యూకు వెళ్లడంతో బెయిర్‌స్టో వికెట్‌ దక్కింది. కాసేపటికే కెప్టెన్ స్టోక్స్‌ (3)ను జడేజా వికెట్ల ముందు దొరక బుచ్చుకున్నాడు. అక్కడే 112/5 స్కోరు వద్ద తొలి సెషన్‌ ముగిసింది. 

అడ్డుకుని... ఆదుకున్నాడు 
ఒక్క సెషన్‌లోనే 5 వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు వెటరన్‌ బ్యాటర్‌ రూట్‌ అంతా తానై నడిపించాడు. బెన్‌ ఫోక్స్‌ అండతో రెండో సెషన్‌లో పరుగులు పేర్చాడు... వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో 108 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఈ సెషనంతా భారత సీమర్లు, స్పిన్నర్లు ఎంతగా కష్టపడినా రూట్, ఫోక్స్‌ జోడీని మాత్రం విడగొట్టలేకపోయారు.

రెండో సెషన్‌లో 86 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ ఒక్క వికెట్‌ను సమర్పించుకోలేదు. ఆఖరి సెషన్లో ఎట్టకేలకు సిరాజ్‌ పేస్‌ పదును పెంచడంతో ఫోక్స్‌ ఆట ముగిసింది. ఆరో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికి హార్ట్‌లీ (13)ని సిరాజే అవుట్‌ చేయగా... రాబిన్సన్‌ (60 బంతుల్లో 31 బ్యాటింగ్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అండతో రూట్‌ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.  

ఇంకో వికెట్‌ చిక్కేదే కానీ... 
మూడో సెషన్లో అప్పటికే భారత జట్టు 3 రివ్యూలు అయిపోవడంతో రాబిన్సన్‌ బతికిపోయాడు. ఇన్నింగ్స్‌ 81వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో రాబిన్సన్‌ ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ను అంపైర్‌ ధర్మసేన తిరస్కరించాడు. టీవీ రీప్లేలో బంతి వికెట్లను తాకుతున్నట్లు తేలింది. కానీ భారత జట్టుకు డీఆర్‌ఎస్‌కు వెళ్లే అవకాశం లేకపోవడంతో రాబిన్సన్‌ బతికిపోయాడు. 

ఇంత కష్టంలో అంత స్కోరు... 
ఈ సిరీస్‌లో మూడు టెస్టుల్లో రూట్‌ అత్యధిక స్కోరు 29! కానీ ఈ మ్యాచ్‌ తన అనుభవాన్నంతా రంగరించి క్లాసిక్‌ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఆరంభంలో 57/3తో కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ లంచ్‌ విరామానికే 112/5 స్కోరు వద్ద సగం వికెట్లను కోల్పోయింది.

ఈ దశలో ఇంకా రెండు సెషన్ల ఆటలో ఏ జట్టయినా ఆలౌట్‌ అయినా అవుతుంది. లేదంటే... కిందామీదా పడినా 200 నుంచి 240 పరుగులు చేయడానికి కష్టపడుతుంది. కానీ ఇన్నింగ్స్‌ను నడిపించిన రూట్‌ ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని జట్టు స్కోరును ఒక్కరోజులోనే 300 పైచిలుకు చేర్చడం అతని అసాధారణ పోరాటానికి నిదర్శనం! 

100 ఇంగ్లండ్‌ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. గతంలో షేన్‌ వార్న్, డెన్నిస్‌ లిల్లీ, ట్రంబెల్, గ్లెన్‌ మెక్‌గ్రాత్, నాథన్‌ లయన్‌ (ఆ్రస్టేలియా), ముత్తయ్య మురళీధరన్‌ (శ్రీలంక), కొట్నీ వాల్‌‡్ష (వెస్టిండీస్‌) ఇంగ్లండ్‌పై 100 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. 

అరంగేట్రం టెస్టులో నోబాల్‌పై తొలి వికెట్‌ తీసి దానిని దక్కించుకోలేకపోయిన ఎనిమిదో బౌలర్‌గా ఆకాశ్‌ దీప్‌ నిలిచాడు. ఈ జాబితాలో లసిత్‌ మలింగ (శ్రీలంక), మైకేల్‌ బీర్‌ (ఆస్ట్రేలియా), బెన్‌ స్టోక్స్‌ (ఇంగ్లండ్‌), మార్క్‌ వుడ్‌ (ఇంగ్లండ్‌), స్టువర్ట్‌ బిన్నీ (భారత్‌), టామ్‌ కరన్‌ (ఇంగ్లండ్‌), నసీమ్‌ షా (పాకిస్తాన్‌) కూడా ఉన్నారు. 

313 టెస్టుల్లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన 313 ప్లేయర్‌గా ఆకాశ్‌ దీప్‌ నిలిచాడు. ఇంగ్లండ్‌తో ప్రస్తుత సిరీస్‌లోనే భారత్‌ నుంచి నలుగురు (రజత్‌ పటిదార్, ధ్రువ్‌ జురేల్, సర్ఫరాజ్‌ ఖాన్, ఆకాశ్‌ దీప్‌) అరంగేట్రం చేయడం విశేషం. 

10  భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా జో రూట్‌ గుర్తింపు పొందాడు. రూట్‌ భారత్‌పై 10 సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో స్టీవ్‌ స్మిత్‌ (9– ఆ్రస్టేలియా), గ్యారీ సోబర్స్‌ (8–వెస్టిండీస్‌), వివియన్‌ రిచర్డ్స్‌ (8–వెస్టిండీస్‌), రికీ పాంటింగ్‌ (8–రికీ పాంటింగ్‌) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

31 టెస్టుల్లో రూట్‌ సెంచరీల సంఖ్య. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రూట్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. మరో రెండు సెంచరీలు చేస్తే ఇంగ్లండ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన అలిస్టర్‌ కుక్‌ (33)  రికార్డును రూట్‌ సమం చేస్తాడు.   

స్కోరు వివరాలు 
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (బి) ఆకాశ్‌ దీప్‌ 42; డకెట్‌ (సి) జురెల్‌ (బి) ఆకాశ్‌ దీప్‌ 11; ఒలీ పోప్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆకాశ్‌ దీప్‌ 0; రూట్‌ (బ్యాటింగ్‌) 106; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్‌ 38; స్టోక్స్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 3; ఫోక్స్‌ (సి) జడేజా (బి) సిరాజ్‌ 47; హార్ట్‌లీ (బి) సిరాజ్‌ 13; రాబిన్సన్‌ (బ్యాటింగ్‌) 31; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 302. వికెట్ల పతనం: 1–47, 2–47, 3–57, 4–109, 5–112, 6–225, 7–245. బౌలింగ్‌: సిరాజ్‌ 13–3–60–2, ఆకాశ్‌దీప్‌ 17–0–70–3,  జడేజా 27–7–55–1, అశ్విన్‌ 22–1–83–1, కుల్దీప్‌ 10–3–21–0, యశస్వి 1–0–6–0. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement