రాంచీలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాడు జో రూట్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుత భారత పర్యటనలో పేలవ ప్రదర్శనలతో ముప్పేట దాడిన ఎదుర్కొన్న రూట్.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి సెంచరీతో కదంతొక్కాడు. ఈ సెంచరీని రూట్ జట్టు కష్ట సమయం ఉన్నప్పుడు సాధించాడు. తాజా సెంచరీతో రూట్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
టెస్ట్‌ల్లో రూట్‌కు ఇది 31 సెంచరీ. అన్ని ఫార్మాట్లలో ఇది 47 శతకం. ఈ సెంచరీతో రూట్ ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (47) కలిసి రూట్ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (45) ఉన్నాడు.
తాజా సెంచరీతో రూట్ ఫాబ్ ఫోర్ ఆటగాళ్లలో (కోహ్లి, రూట్, స్మిత్, కేన్) మూడో అత్యుత్తమ ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగు చేసుకున్నాడు. ఫాబ్ ఫోర్‌లో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ (31) మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో విలియమ్సన్ (32), స్టీవ్ స్మిత్ (32) టాప్‌లో ఉండగా.. రూట్, కోహ్లి (29) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.
ఈ సెంచరీతో రూట్ మరో భారీ రికార్డును సైతం ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా రూట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో రూట్.. స్టీవ్ స్మిత్‌ను (9) అధిగమించాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. రాంచీ టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్ స్టోక్స్ (3), బెన్ ఫోక్స్(47), టామ్ హార్ట్లీ (13) ఔట్ కాగా.. రూట్ (106), రాబిన్సన్ (31) క్రీజ్‌లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్‌దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్ 2, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment