IND VS ENG 4th Test: సీనియర్లు లేకపోయినా ఇరగదీసిన యంగ్‌ ఇండియా | Team India Beat England In Fourth Test In The Absence Of Senior Players Like Kohli, Shami, Rahul, Bumrah | Sakshi
Sakshi News home page

IND VS ENG 4th Test: సీనియర్లు లేకపోయినా ఇరగదీసిన టీమిండియా

Published Mon, Feb 26 2024 3:35 PM | Last Updated on Mon, Feb 26 2024 4:03 PM

Team India Beat England In Fourth Test In The Absence Of Senior Players Like Kohli, Shami, Rahul, Bumrah - Sakshi

రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి గెలుపొందింది. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత జట్టు తొలుత తడబాటుకు లోనైనప్పటికీ ఆతర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో మెరిసిన దృవ్‌ జురెల్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ రాణించి (39 నాటౌట్‌) జట్టు విజయంలో ప్రధాన ప్రాత పోషించాడు. జురెల్‌కు జతగా శుభ్‌మన్‌ గిల్‌ (52 నాటౌట్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 72 పరుగులు జోడించి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. 

ఈ మ్యాచ్‌లో టీమిండియా.. సీనియర్లు కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, బుమ్రా, షమీ,  లేకపోయినా అద్భుతంగా రాణించడం విశేషం. కెప్టెన్‌ రోహిత్‌, అశ్విన్‌, జడేజా మినహా ఈ జట్టులో  అందరూ పాతిక లోపు టెస్ట్‌లు ఆడినవారే ఉన్నారు. ఈ జట్టులో అనుభవలేమి స్పష్టంగా కనిపించినా, యువ ఆటగాళ్లు ఏమాత్రం తగ్గలేదు. యశస్వి (73, 37), గిల్‌ (38, 52 నాటౌట్‌), జురెల్‌ (90, 39 నాటౌట్‌), ఆకాశ్‌దీప్‌ (తొలి ఇన్నింగ్స్‌లో 3/83), కుల్దీప్‌ (సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 4/22) ఆకాశమే హద్దుగా చెలరేగారు.

సర్ఫరాజ్‌ (14, 0), పాటిదార్‌ (17, 0) నిరాశపర్చినప్పటికీ.. ఆ లోటును మిగతా కుర్రకారు భర్తీ చేసింది. ఈ మ్యాచ్‌లో జురెల్‌ ఆడిన రెండు ఇన్నింగ్స్‌లు అతని జీవితాన్నే మార్చేశాయి. ఈ ప్రదర్శనలతో అతను టీమిండియా పెర్మనెంట్‌ టెస్ట్‌ వికెట్‌కీపర్‌గా మారే అవకాశం ఉంది. అంతిమంగా క్రెడిట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు దక్కుతుంది. అతను యువ ఆటగాళ్లను అద్భుతంగా వాడుకుని సత్ఫలితాలు రాబట్టాడు. వ్యక్తిగతంగానూ పర్వాలేదనిపించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో (2) నిరాశపర్చినప్పటికీ.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతమైన అర్దసెంచరీతో (55) రాణించాడు. కెప్టెన్‌గా రోహిత్‌కు ఈ సిరీస్‌ చిరకాలం గుర్తుండిపోతుంది. తొలి టెస్ట్‌ నుంచి సీనియర్ల గైర్హాజరీ ఇబ్బంది పెట్టినప్పటికీ అతను కుర్రాళ్లను అద్భుతంగా వాడుకుని మరపురాని విజయాలు సాధించాడు. రోహిత్‌కు సీనియర్‌ స్పిన్నర్లు అశ్విన్‌ (1/83, 5/51), జడేజా (4//67, 1/56) అండగా నిలిచారు. వీరిద్దరు జట్టు విజయంలో తమవంతుపాత్ర పోషించారు. 

స్కోర్‌ వివరాలు.. 

  • ఇంగ్లండ్‌ 353 & 145
  • భారత్‌ 307 & 192/5
  • 5 వికెట్ల తేడాతో భారత్ విజయం
  • ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: దృవ్‌ జురెల్‌
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement