రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4000 టెస్ట్ పరుగుల మార్కును తాకిన హిట్‌మ్యాన్.. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన 17వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
హిట్‌మ్యాన్‌కు ముందు సచిన్ (15921), ద్రవిడ్ (13265), గవాస్కర్ (10122), కోహ్లి (8848), లక్ష్మణ్ (8781), సెహ్వాగ్ (8503), గంగూలీ (7212), పుజారా (7195), వెంగ్సార్కర్ (6868), అజారుద్దీన్ (6215), గుండప్ప విశ్వనాథ్ (6080), కపిల్ దేవ్ (5248), రహానే (5077), ధోని (4876), మొహిందర్ అమర్‌నాథ్ (4378), గంభీర్ (4154) భారత్ తరఫున టెస్ట్‌ల్లో 4000 పరుగుల మైలురాయిని దాటారు.
అత్యంత వేగంగా 4000 పరుగుల మార్కును తాకిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ పదో స్థానంలో నిలిచాడు. ఈ మైలురాయిని వీరేంద్ర సెహ్వాగ్ అందరి కంటే వేగంగా చేరుకున్నాడు. వీరూ కేవలం 79 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును తాకగా.. హిట్‌మ్యాన్‌కు 100 ఇన్నింగ్స్‌లు పట్టాయి.
టెస్ట్ క్రికెట్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టన రోహిత్.. ఈ ఫార్మాట్‌లో 58 మ్యాచ్‌లు ఆడి 11 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీల సాయంతో 44.99 సగటున 4004 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. వన్డేల్లో 10000 పరుగుల మైలురాయిని (262 మ్యాచ్‌ల్లో 10709) దాటిన రోహిత్.. టీ20ల్లో 4000 పరుగుల మార్కుకు 26 పరుగుల దూరంలో (151 మ్యాచ్‌ల్లో 3974 పరుగులు) ఉన్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు దాదాపుగా ఖరారైంది. మరో 152 పరుగులు చేస్తే భారత్ విజయఢంకా మోగిస్తుంది. రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.
అంతకుముందు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అశ్విన్ (5/51), కుల్దీప్ (4/22) ధాటికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో పేకమేడలా కూలింది. జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్‌స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment