అటో...ఇటో... కాదు! స్పిన్ ఎటు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. దీంతో రాంచీ టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. మూడో రోజు ఆటలో 13 వికెట్లు రాలితే... ఇందులో 12 స్పిన్ వలలోనే చిక్కాయి. ఈ నేపథ్యంలో భారత్ ముందు ఊరించే 192 పరుగుల లక్ష్యం ఉన్నప్పటికీ... ఇంకా 152 పరుగుల దూరం స్పిన్ టర్న్ దృష్ట్యా భారత్‌కు అంత సులభం కాదు. భారత బ్యాటర్లు స్పిన్‌కు నిలబడితే సిరీస్ 3–1తో మన సొంతమవుతుంది. ఇంగ్లండ్ స్పిన్నర్లు 10 వికెట్లు తీస్తే మాత్రం సిరీస్ 2–2తో సమమవుతుంది.
రాంచీ: మూడో రోజు పూర్తిగా స్పిన్ మలుపు తీసుకున్న నాలుగో టెస్టులో భారత్ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయిన టీమిండియా... ప్రత్యర్థి రెండో ఇన్నింగ్స్‌ను 150 పరుగుల్లోపే కూల్చేసింది. ఈ మ్యాచ్ గెలిచేందుకు, సిరీస్ చేజిక్కించుకొనేందుకు 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్ (24 బ్యాటింగ్), యశస్వి (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విజయానికి భారత్ 152 పరుగుల దూరంలో ఉంది.
మూడో రోజు ఆట సాగిందిలా...
ఓవర్‌నైట్ స్కోరు 219/7తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 103.2 ఓవర్లలో 307 పరుగుల వద్ద ఆలౌటైంది. ధ్రువ్ జురెల్ (149 బంతుల్లో 90; 6 ఫోర్లు, 4 సిక్స్) అద్భుతమైన పోరాటం చేశాడు. ఓవర్‌నైట్ సహచరుడు కుల్దీప్ (131 బంతుల్లో 28; 2 ఫోర్లు)తో ఎనిమిదో వికెట్‌కు 76 పరుగులు జోడించిన జురెల్ తొలి అర్ధసెంచరీ సాధించాడు.
వెంటనే జురెల్ సెల్యూట్ చేసి మాజీ సైనికుడు, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న తన నాన్నకు ఈ అర్ధ సెంచరీ అంకితమిచ్చాడు. 253 స్కోరు వద్ద కుల్దీప్ అవుటైనా... అప్పు డే జట్టు ఆలౌట్ కాలేదు. ఆకాశ్‌దీప్ (9)తో తొమ్మి దో వికెట్‌కు 40 పరుగులు జతచేసి జట్టు స్కోరు 300 దాటాకే జురెల్ అవుటయ్యాడు. మూడో రోజు భారత్ 88 పరుగులు చేస్తే అందులో 68 పరుగులు జురెలే సాధించి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.
ఇంగ్లండ్ కూలిందిలా...
తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు ఆధిక్యం పొందిన ఇంగ్లండ్ లంచ్ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే తొలి ఓవర్ నుంచే కెపె్టన్ రోహిత్ ఇంగ్లండ్ మెడకు అశ్విన్‌తో స్పిన్ ఉచ్చు బిగించాడు. ఇది ఐదో ఓవర్ నుంచి ఫలితాల్ని ఇవ్వడంతో ఇంగ్లండ్ కుదేలైంది. ఐదో ఓవర్లో అశ్విన్ ఓపెనర్ డకెట్ (15), పోప్ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు.
మరో ఓపెనర్ క్రాలీ (91 బంతుల్లో 60; 7 ఫోర్లు) అశ్విన్, జడేజా, కుల్దీప్‌ల స్పిన్ త్రయానికి కాసేపు ఎదురునిలిచాడు. కానీ ఈ లోపే రూట్ (11)ను అశ్విన్, అర్ధ శతకం తర్వాత క్రాలీ, స్టోక్స్ (4) వికెట్లను కుల్దీప్ పడేశాడు. జడేజా కూడా బెయిర్ స్టో (30)ను అవుట్ చేయడం ద్వారా 120/6 స్కోరు వద్ద ఇంగ్లండ్ బ్యాటింగ్ బలగమంతా పెవిలియన్‌లో కూర్చుంది.
మిగిలిన టెయిలెండర్లలో హార్ట్‌లీ (7), రాబిన్సన్ (0)లను కుల్దీప్ వెనక్కి పంపగా, అండర్సన్ (0)ను అవుట్ చేసిన అశ్విన్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌కు 145 పరుగుల వద్ద తెరదించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు భారత స్పిన్నర్లకే (అశ్విన్ 5/51; కుల్దీప్ 4/22; జడేజా 1/56) దక్కడం విశేషం.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353;
భారత్ తొలి ఇన్నింగ్స్: 307;
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) కుల్దీప్ 60; డకెట్ 15; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 0; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 11; బెయిర్‌స్టోక్ (సి) పటిదార్ (బి) జడేజా 30; స్టోక్స్ (బి) కుల్దీప్ 4; ఫోక్స్ (సి అండ్ బి) అశ్విన్ 17; హార్ట్‌లీ (సి) సర్ఫరాజ్ (బి) కుల్దీప్ 7; రాబిన్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 0; బషీర్ (నాటౌట్) 1; అండర్సన్ (సి) జురెల్ (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (53.5 ఓవర్లలో ఆలౌట్) 145. వికెట్ల పతనం: 1–19, 2–19, 3–65, 4–110, 5–120, 6–120, 7–133, 8–133, 9–145, 10–145. బౌలింగ్: అశ్విన్ 15.5–0–51–5, జడేజా 20–5–56–1, సిరాజ్ 3–0–16–0, కుల్దీప్ 15–2–22–4.
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బ్యాటింగ్) 24; యశస్వి (బ్యాటింగ్) 16; మొత్తం (8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 40. బౌలింగ్: రూట్ 4–0–17–0, హార్ట్‌లీ 3–0–22–0, బషీర్ 1–0–1–0.
Comments
Please login to add a commentAdd a comment