ఐదుటెస్టుల సిరీస్‌లో భారత్ మూడో టెస్టుతో పైచేయి సాధించింది. ఇప్పుడు రాంచీలో సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ బృందానికి ఇప్పుడు యువ ఆటగాళ్లే బలంగా మారారు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ అవకాశాల్ని బాగా అందిపుచ్చుకున్నారు. ఇపుడు ఇదే బలగంతో ఒక మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను ఇక్కడే ముగించాలని టీమిండియా ఆశిస్తోంది.
రాంచీ: తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో అనూహ్యంగా ఓడిన భారత్ ఆ తర్వాత వరుసగా రెండు, మూడు టెస్టుల్లో గెలిచింది. రెండో టెస్టులో బుమ్రా పేస్, మూడో టెస్టులో జడేజా స్పిన్ కీలక భూమిక పోషిస్తే... ఈ రెండు టెస్టుల్లోనూ యువ సంచలనం యశస్వి డబుల్ సెంచరీలు కామన్‌గా కలిసొచ్చాయి.
రోహిత్, గిల్‌లతో టాపార్డర్‌కు ఏ ఢోకా లేదు. మిడిలార్డరే అనుభవలేమితో ఉంది. రజత్ పటిదార్‌కు రెండు మ్యాచ్‌ల్లోనూ అవకాశమిచ్చి నా ఏమాత్రం మెప్పించలేకపోయాడు. గత మ్యాచ్ ఆడిన సర్ఫరాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిరూపించుకున్నాడు. జడేజా శతకం మిడిలార్డర్‌ను నిలబెట్టింది. బుమ్రా లేని పేస్ బౌలింగ్‌కు తొలిసారిగా సిరాజ్ పెద్దదిక్కయ్యాడు.
ఇన్నాళ్లు షమీ, బుమ్రాలతో బంతిని పంచుకునే అతను రాంచీలో ప్రధాన పేసర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. స్పిన్ వికెట్ కాబట్టి ముగ్గురు రెగ్యులర్ స్పిన్నర్లు బరిలోకి దిగడం ఖాయమనిపిస్తోంది. గురువారం నెట్స్‌లో ఆకాశ్‌దీప్ గంటల తరబడి శ్రమించాడు. ఒకవేళ సిరాజ్‌కు జోడీగా అతన్ని పరిశీలించవచ్చు.
సమం కోసం ఇంగ్లండ్ సమరం
ప్రస్తుత భారత్‌తో పోలిస్తే స్టోక్స్, రూట్, డకెట్, క్రాలీ, పోప్, అండర్సన్‌లతో కూడిన ఇంగ్లండే అనుభవజు్ఞలతో మేటిగా ఉంది. అయినాసరే సిరీస్ లో భారత కుర్రాళ్ల జోరుకు కళ్లెం వేయలేక డీలా పడుతోంది.
రాజ్‌కోట్‌లో అయితే మొదటి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన స్టోక్స్ సేన రెండో ఇన్నింగ్స్‌కు వచ్చేసరికి చేతులెత్తేసింది. రూట్, ఒలీ పోప్, బెయిర్‌స్టోల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. చాన్నాళ్ల తర్వాత కెప్టెన్ స్టోక్స్ బౌలింగ్ వేసేందుకు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. గతేడాది యాషెస్ సిరీస్ మధ్యలోనే మోకాలి గాయం వల్ల స్టోక్స్ పూర్తిగా బ్యాటింగ్‌కే పరిమితమయ్యాడు.
గత జూన్ నుంచి బౌలింగ్‌కే దిగలేదు. ఇప్పుడు మాత్రం బంతిపట్టే యోచనలో పడ్డాడు. వరుస మ్యాచ్‌ల ఓటమిలతో ఇంగ్లండ్ తుది జట్టులో మార్పులు చేసింది. లెగ్ స్పిన్నర్ రేహన్ అహ్మద్ స్థానంలో ఆఫ్‌స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను హార్ట్‌లీకి జోడీగా బరిలోకి దించుతోంది. మార్క్ వుడ్‌ను తప్పించి రాబిన్సన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, శుబ్‌మన్ గిల్, పటిదార్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్, జడేజా, అశ్విన్, సిరాజ్, కుల్దీప్, ముకేశ్/ఆకాశ్‌దీప్.
ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, ఒలీ పోప్, జో రూట్, బెయిర్‌స్టో, ఫోక్స్, హార్ట్‌లీ, బషీర్, రాబిన్సన్, అండర్సన్.
Comments
Please login to add a commentAdd a comment