మరో రికార్డుకు చేరువలో అశ్విన్
ముంబై:భారత క్రికెట్ ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ తో నగరంలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన నాల్గో మ్యాచ్లో అశ్విన్ 12 వికెట్లు తీసి అదుర్స్ అనిపించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. తద్వారా 10 వికెట్లను అత్యధిక సార్లు తీసిన రెండో భారత్ బౌలర్ గా నిలిచాడు. భారత్ నుంచి అశ్విన్ ఏడుసార్లు 10 వికెట్ల మార్కును చేరాడు.
దాంతో భారత్ తరపున 10 వికెట్లను అత్యధిక సార్లు తీసిన అనిల్ కుంబ్లే తరువాత స్థానంలో అశ్విన్ నిలిచాడు. కుంబ్లే 8 సార్లు 10 వికెట్లను తన ఖాతాలో వేసుకుని ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఆ రికార్డును అశ్విన్ అధిగమించడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఇంకా ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్, ఆపై స్వల్ప వ్యవధిలో ఆసీస్తో సిరీస్లు ఉన్న నేపథ్యంలో అక్కడ అశ్విన్ ఈ ఘనతను అందుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, అనిల్ కుంబ్లే 132 మ్యాచ్ల్లో ఈ ఘనతను చేరగా, అశ్విన్ 43 మ్యాచ్ల్లోనే ఏడుసార్లు 10 వికెట్లను సాధించడం విశేషం. మరొకవైపు కపిల్ దేవ్ 23 సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డును అశ్విన్ అధిగమించాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ ద్వారా అశ్విన్ 24వ సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు అశ్విన్ సాధించాడు. ఈ జాబితాలో భారత్ నుంచి కుంబ్లే(35సార్లు), హర్భజన్(25సార్లు)వరుస స్థానాల్లో ఉన్నారు.
ఇటీవల 200 వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్గా అశ్విన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇంగ్లండ్ తో నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మొయిన్ అలీవికెట్ను సాధించడం ద్వారా భారత తరపున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ఏడో బౌలర్గా అశ్విన్ గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలోనే భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అశ్విన్ అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 3-0తో సొంతం చేసుకుంది. చివరి, ఐదో రోజు సోమవారం.. 182/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. భారత బౌలర్ అశ్విన్ అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఎంతో సేపు సాగలేదు. అశ్విన్ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అశ్విన్ తొలుత ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో (51)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత అశ్విన్ వరుస ఓవర్లలో వోక్స్, రషీద్, ఆండర్సన్‌లను పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది.
ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 55.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ ఘన విజయాన్ని సాధించింది. భారత్ లక్ష్యసాధనకు దిగకుండానే ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ రోజు ఆటలో కేవలం 8.0ఓవర్లు మాత్రమే ఆడిన ఇంగ్లండ్ మిగతా నాలుగు వికెట్లను నష్టపోయింది. దాదాపు మ్యాచ్ ప్రారంభమైన అరగంటలోపే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగియడం గమనార్హం.తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లండ్ 400, భారత్ 631 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.