35 ఓవర్లలో 5.91 రన్‌రేట్‌తో 207 పరుగులు. పిచ్‌ను, ప్రత్యర్థిని లక్ష్య పెట్టకుండా ఇంగ్లండ్ మూడో టెస్టులోనూ తమ ‘బజ్‌బాల్’ మంత్రాన్ని చూపించింది. ఫలితంగా 445 పరుగుల భారీ స్కోరు కూడా భారత్‌కు సురక్షితం కాదనిపిస్తోంది.
భారత గడ్డపై ఒక విదేశీ బ్యాటర్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలిచిపోయే శతకంతో ఓపెనర్ బెన్ డకెట్ చెలరేగాడు. దాంతో రెండు రోజుల ఆట తర్వాత రాజ్‌కోట్ టెస్టు సమంగా నిలిచింది.
అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడం శుక్రవారం ఆటలో గుర్తుంచుకోదగ్గ మరో హైలైట్. మూడో రోజు ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు ఎలా నిలువరిస్తారన్నదే ఆసక్తికరం.
రాజ్‌కోట్: భారత్‌తో మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ దూకుడుగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెన్ డకెట్ (118 బంతుల్లో 133 బ్యాటింగ్; 21 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో సత్తా చాటాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 326/5తో ఆట కొనసాగించిన భారత్ 445 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ్ జురేల్ (46), అశ్విన్ (37) ఎనిమిదో వికెట్‌కు 77 పరుగులు జత చేశారు. ఇంగ్లండ్ మరో 238 పరుగులు వెనుకబడి ఉంది.
కీలక భాగస్వామ్యం...
రెండో రోజు ఆరంభంలోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో ఐదు పరుగులు జోడించగానే ఒకే స్కోరు వద్ద కుల్దీప్ (4), జడేజా (112) వెనుదిరిగారు. ఈ దశలో అశ్విన్, జురేల్ భాగస్వామ్యం భారత్‌ను 400 పరుగులు దాటించింది.
అశ్విన్ జాగ్రత్తగా ఆడగా, అరంగేట్ర ఆటగాడు జురేల్ కొన్ని దూకుడైన షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే తన తొలి మ్యాచ్‌లో అతను అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ భాగస్వామ్యం తర్వాత చివర్లో బుమ్రా (28 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని విలువైన పరుగులు జోడించాడు. శుక్రవారం 44.5 ఓవర్లు ఆడిన భారత్ మరో 119 పరుగులు జత చేసింది.
దూకుడే దూకుడు...
ఇన్నింగ్స్ ఆరంభంలో డకెట్ కాస్త తడబడ్డాడు. కానీ బుమ్రా వేసిన ఐదో ఓవర్లో రెండు ఫోర్లతో ధాటిని మొదలు పెట్టిన అతను ఏ బౌలర్‌నూ వదలకుండా చివరి వరకు దూకుడు కొనసాగించాడు. సెంచరీ వరకు కూడా ఒక్క తప్పుడు షాట్ లేకుండా అతని ఇన్నింగ్స్ అద్భుతమైన స్ట్రోక్‌లతో దూసుకెళ్లింది. టీ తర్వాత తొలి ఓవర్‌నుంచి స్పిన్నర్ కుల్దీప్‌తో బౌలింగ్ వేయించిన ప్రణాళిక ఫలించలేదు.
కుల్దీప్ తొలి 4 ఓవర్లలో డకెట్ స్వీప్, రివర్స్ స్వీప్‌లతో 7 ఫోర్లు బాదడం విశేషం. సిరాజ్ ఓవర్లో కొట్టిన రెండు ఫోర్లతో 39 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. మరో ఎండ్‌లో దాదాపు ప్రేక్షక పాత్రకే పరిమితమైన క్రాలీ (15)ని అవుట్ చేసి ఎట్టకేలకు అశ్విన్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.
తర్వాత వచ్చి న ఒలీ పోప్ (39; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఇంగ్లండ్ జోరును కొనసాగించాడు. అశ్విన్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 కొట్టి 90ల్లోకి చేరుకున్న డకెట్... సిరాజ్ ఓవర్లో బౌండరీతో 88 బంతుల్లోనే కెరీర్‌లో మూడో శతకాన్ని అందుకున్నాడు. చివరకు సిరాజ్ చక్కటి బంతికి పోప్ వికెట్ల ముందు దొరికిపోయాడు.
ఐదు పరుగులు పెనాల్టీ...
భారత బ్యాటర్లు నిబంధనలకు విరుద్ధంగా పిచ్‌పై పరుగెత్తడంతో అంపైర్లు చర్య తీసుకున్నారు. తొలి రోజు ఆటలో జడేజాను ఈ విషయంపై అంపైర్లు హెచ్చరించగా... రెండో రోజు అశ్విన్ కూడా అలాగే చేయడంతో భారత ఇన్నింగ్స్ 102వ ఓవర్లో 5 పరుగులు పెనాల్టిగా విధించారు. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 5/0తో మొదలైంది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) రూట్ (బి) వుడ్ 10; రోహిత్ (సి) స్టోక్స్ (బి) వుడ్ 131; గిల్ (సి) ఫోక్స్ (బి) వుడ్ 0; పటిదార్ (సి) డకెట్ (బి) హార్ట్‌లీ 5; జడేజా (సి) అండ్ (బి) రూట్ 112; సర్ఫరాజ్ (రనౌట్) 62; కుల్దీప్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 4; జురేల్ (సి) ఫోక్స్ (బి) రేహన్ 46; అశ్విన్ (సి) అండర్సన్ (బి) రేహన్ 37; బుమ్రా (ఎల్బీ) (బి) వుడ్ 26; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (130.5 ఓవర్లలో ఆలౌట్) 445. వికెట్ల
పతనం: 1–22, 2–24, 3–33, 4–237, 5–314, 6–331, 7–331, 8–408, 9–415, 10–445.
బౌలింగ్: అండర్సన్ 25–7–61–1, వుడ్ 27.5–2– 114–4, హార్ట్‌లీ 40–7–109–1, రూట్ 16–3– 70–1, రేహన్ 22–2–85–2.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాసీ (సి) పటిదార్ (బి) అశ్విన్ 15; డకెట్ (బ్యాటింగ్) 133; పోప్ (ఎల్బీ) (బి) సిరాజ్ 39; రూట్ (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (35 ఓవర్లలో 2 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–89, 2–182. బౌలింగ్: బుమ్రా 8–0–34–0, సిరాజ్ 10–1–54–1, కుల్దీప్ యాదవ్ 6–1–42–0, అశ్విన్ 7–0–37–1, జడేజా 4–0–33–0.
అశ్విన్ @ 500
ఇంగ్లండ్ ఓపెనర్ క్రాలీని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తన 98వ టెస్టులో ఈ ఘనత సాధించిన అశ్విన్... ఓవరాల్‌గా 9వ ఆటగాడిగా, అనిల్ కుంబ్లే (619) తర్వాత రెండో భారత బౌలర్‌గా నిలిచాడు.
మ్యాచ్‌లు, బంతుల పరంగా చూస్తే... అత్యంత వేగంగా 500 వికెట్ల మార్క్‌ను చేరిన బౌలర్లలో అశ్విన్ రెండో స్థానంలో నిలవడం విశేషం. 2011లో విండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన అశ్విన్ ఇప్పటి వరకు ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు 24 సార్లు... ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 34 సార్లు... మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు 8 సార్లు తీశాడు.
టెస్టు నుంచి తప్పుకున్న అశ్విన్
రాజ్‌కోట్ టెస్టులో అనూహ్య పరిణామం సంభవించింది. తన కుటుంబంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అశ్విన్ మూడో టెస్టు నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment