
విజయానంతరం పంజాబ్ ఓపెనర్ గేల్‌తో కోహ్లి సరదా ముచ్చట్లు...
ఐపీఎల్ ఆరంభం నుంచి బ్యాటింగ్‌లో ఇద్దరినే నమ్ముకొని విజయాలు సాధిస్తూ వచ్చిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆ ఇద్దరు విఫలమైతే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. ఒకే ఓవర్లో రాహుల్, గేల్ అవుట్... మూడు రనౌట్లు... ఏకంగా 29 బంతులు మిగిలి ఉండగానే ముగిసిన ఇన్నింగ్స్... 52 పరుగుల వ్యవధిలో పడిన 10 వికెట్లు... ఫలితంగా అశ్విన్ బృందానికి ఘోర పరాభవం... రెండు రోజుల క్రితమే ఇక్కడే 214 పరుగులు చేసిన ఆ జట్టు ఈసారి బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో 88 పరుగులకే చాప చుట్టేసి నిరాశపర్చింది.
ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధిస్తే తప్ప ముందుకు వెళ్లలేని తీవ్ర ఒత్తిడిలో ఉన్న రాయల్ చాలెంజర్స్‌కు ‘బూస్ట్’లాంటి గెలుపు. ఉమేశ్ యాదవ్ అద్భుత బౌలింగ్‌కు తోడు చక్కటి ఫీల్డింగ్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన తర్వాత గెలుపు కోసం విరాట్ కోహ్లి ఇంకా ఆలస్యం చేయదల్చుకోలేదు. పార్థివ్‌తో కలిసి ఫటాఫట్ బ్యాటింగ్‌తో వికెట్ కూడా నష్టపోకుండా కెప్టెన్ లాంఛనం ముగించాడు. మరో 71 బంతులు ఉండగానే జట్టుకు భారీ విజయాన్ని అందించి అతి కీలకమైన రన్‌రేట్‌ను కూడా రాకెట్‌లా దూసుకుపోయేలా చేశాడు.
ఇండోర్: ఐపీఎల్–11లో అతి చెత్త బ్యాటింగ్ ప్రదర్శన నమోదైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పని పట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యంత సునాయాస విజ యాన్ని అందుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 10 వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 15.1 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటైంది. ఆరోన్ ఫించ్ (23 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉమేశ్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆర్‌సీబీ 8.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 92 పరుగులు సాధించింది. కోహ్లి (28 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), పార్థివ్ పటేల్ (22 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. వీరిద్దరి ధాటికి 49 బంతుల్లోనే విజయం ఆర్‌సీబీ సొంతమైంది.
52/10...
సరిగ్గా నెల రోజుల క్రితం బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ ఇదే ప్రత్యర్థిపై ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి తమ జట్టును గెలిపించాడు. ఇప్పుడు సరిగ్గా అవే గణాంకాల (3/23)తో అతను మరోసారి పంజాబ్ పని పట్టడం విశేషం. ఉమేశ్ వేసిన తొలి ఓవర్లోనే ‘సున్నా’ వద్ద గేల్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ పార్థివ్ వదిలేసినా దాని ప్రభావం మ్యాచ్‌పై పడలేదు. సౌతీ, ఉమేశ్ బౌలింగ్‌లో సిక్సర్లు బాది రాహుల్ (15 బంతుల్లో 21; 3 సిక్సర్లు) దూకుడుగా ఆడే ప్రయత్నం చేయగా, సౌతీ వేసిన తర్వాతి ఓవర్లో గేల్ (14 బంతుల్లో 18; 4 ఫోర్లు) మూడు ఫోర్లు కొట్టాడు. అయితే 4 ఓవర్లు ముగిసే సరికి 28 పరుగులకు చేరిన పంజాబ్ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో షార్ట్ పిచ్ బంతులతో ఓపెనర్లను అవుట్ చేసి ఉమేశ్ పంజాబ్‌ను దెబ్బ తీశాడు. మూడో బంతికి గ్రాండ్‌హోమ్ చక్కటి క్యాచ్‌కు రాహుల్ వెనుదిరగ్గా... చివరి బంతికి సిరాజ్ పట్టిన క్యాచ్‌తో గేల్ ఆట ముగిసింది. ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ ఆటగాళ్లు ఒకరితో మరొకరు పోటీ పడి డగౌట్ చేరారు. మరో రెండు బంతులకే నాయర్ (1)ను సిరాజ్ అవుట్ చేయగా, తర్వాతి ఓవర్లో స్టొయినిస్ (2)ను చహల్ బౌల్డ్ చేశాడు. మయాంక్ అగర్వాల్ (2) కూడా ఎక్కువ సేపు నిలవకపోవడంతో పంజాబ్ పరిస్థితి దారుణంగా మారింది. మరో ఎండ్‌లో ఫించ్ మాత్రం కొన్ని షాట్లతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే మొయిన్ అలీ తన తొలి ఓవర్లోనే ఫించ్‌ను వెనక్కి పంపగా...అదే ఓవర్లో లేని పరుగు కోసం ప్రయత్నించి రవిచంద్రన్ అశ్విన్ (0) రనౌటయ్యాడు. తర్వాతి మూడు వికెట్లను తీసేందుకు బెంగళూరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకపోయింది. వీటిలో చివరి రెండు వికెట్లు రనౌట్ల రూపంలోనే వచ్చాయి.
అవలీలగా...
సునాయాస లక్ష్యాన్ని ఆర్‌సీబీ ఏమాత్రం అలసట లేకుండా ఛేదించేసింది. అశ్విన్ వేసిన తొలి ఓవర్లో 9 పరుగులు రాబట్టిన బెంగళూరు, టై వేసిన రెండో ఓవర్లో పార్థివ్ ఫోర్లతో 11 పరుగులు సాధించింది. రాజ్‌పుత్ వేసిన మూడో ఓవర్లోనైతే కోహ్లి చెలరేగిపోయాడు. సిక్స్, రెండు ఫోర్లు బాదడంతో మరో 16 పరుగులు ఆర్‌సీబీ ఖాతాలో చేరాయి. ఆ తర్వాత మోహిత్ తొలి ఓవర్లో పార్థివ్ మూడు బౌండరీలతో దూకుడు ప్రదర్శించాడు. టై ఓవర్లో కోహ్లి మళ్లీ 4, 6 కొట్టడంతో పవర్ ప్లే ముగిసి సరికే ఆ జట్టు స్కోరు 66 పరుగులకు చేరింది. మిగిలిన పరుగులు సాధించేందుకు బెంగళూరుకు 13 బంతులు సరిపోయాయి.
► 3 ఐపీఎల్‌లో 10 వికెట్ల తేడాతో గెలవడం బెంగళూరుకు ఇది మూడో సారి. ఏ జట్టు కూడా ఒకసారికి మించి గెలవలేదు.
► 5 ఉమేశ్‌కు పంజాబ్‌పై ఇది ఐదో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. గతంలో యూసుఫ్ పఠాన్ (దక్కన్ చార్జర్స్‌పై) మాత్రమే ఒకే ప్రత్యర్థిపై ఇన్ని సార్లు ఈ ఘనత సాధించాడు. పంజాబ్‌పై అతను ఏడు సార్లు మ్యాచ్‌లో కనీసం మూడేసి వికెట్లు పడగొట్టాడు. మరే బౌలర్ ఐదు సార్లకు మించి ఈ గణాంకం నమోదు చేయలేదు.
► 1 ఐదు ఐపీఎల్ సీజన్‌లలో 500కు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడు కోహ్లి. వార్నర్ 4 సార్లు ఈ ఘనత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment