'300 టెస్టులను ధైర్యంగా ఎదుర్కొన్నాం'
రియో ఒలింపిక్స్ నేపథ్యంలో రష్యా డోపింగ్ టెస్టుల వివాదంలో కొన్ని క్రీడాంశాలలో గట్టెక్కగా మరికొన్ని ఈవెంట్లలో పోటీలో పాల్గొనకుండానే ఇంటిబాట పట్టింది. ముఖ్యంగా రష్యా అథ్లెట్లు ఒక్కో డోపింగ్ టెస్టులో పదుల సంఖ్యలో విఫలమైన విషయం తెలిసిందే. ఈ విషయంపై రష్యా క్రీడాశాఖ మంత్రి విటాలీ ముక్తో కొన్ని ఆసక్తికర విషయాలను శనివారం మీడియాకు వెల్లడించారు. ఏది ఏమైతేనేం రియో ఒలింపిక్స్ సందర్భంగా ఆటగాళ్లకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మేము ఆ అవరోధాలను సమర్థవంతంగా ఎదర్కొని ముందుకు సాగిపోతున్నామని పేర్కొన్నారు.
రియో ఒలింపిక్స్ సందర్భంగా రష్యా అథ్లెట్లు 300 కంటే ఎక్కువ డోపింగ్ టెస్టులను దిగ్విజయంగా ఎదుర్కొందన్నారు. అయితే జూలైలో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) లో కీలక సభ్యుడిగా ఉన్న కెనడా ప్రొఫెసర్ రిచర్డ్ మెక్ లారెన్ దర్యాప్తు జరిపి రష్యా అథ్లెట్ల డోపింగ్ బాగోతాన్ని బయటపెట్టగా, కొందరు అథ్లెట్లపై నిషేధం వేటు పడింది. వాడా నివేదిక కంటే ముందుగానే తీసుకున్న శాంపిల్స్ టెస్టు చేయగా, వాటి ఫలితాల ఆధారంగానే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ) మా ఆటగాళ్లకు అవకాశం కల్పించిందని క్రీడాశాఖ మంత్రి వెల్లడించారు.