
సచిన్.. సచిన్ అన్న తొలివ్యక్తి ఎవరో తెలిసింది
ముంబయి: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేసి ఉండొచ్చు.. కానీ, ఆయనగానీ, ఆయన ఫొటోగానీ ఒక్కసారి కనిపించిందంటే చాలు ఇప్పటికీ చెప్పలేనంత క్రేజ్.. సచిన్.. సచిన్ అంటూ ఆయన ఉన్న క్రీడా ప్రాంగణంగానీ, చోటుగానీ మార్మోగిపోతోంది. అంతగా ప్రజల నాలుకల్లో మిగిలిపోయాడు మాస్టర్ బ్లాస్టర్. అయితే, సచిన్.. సచిన్ అంటూ మొత్తం ప్రపంచంలోని ఆయన క్రికెట్ అభిమానులు అంటున్నప్పటికీ మొట్టమొదటిసారి అలా అన్నది ఎవరూ అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.
అలా పిలవడం ఎవరు ప్రారంభించారనే వివరాలు కూడా తెలియదు. ఆ రహస్యాన్ని స్వయంగా సచినే ఇప్పుడు ప్రకటించాడు. వాస్తవానికి మొట్టమొదటిసారి సచిన్.. సచిన్ అంటూ కీర్తించడం తన తల్లి ప్రారంభించిందంట. ‘సచిన్..సచిన్ అనే మాట నేను ఆడుతున్నన్నీ రోజులు నాతోనే ఉంటుందని, నాకు వినిపిస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు అది సినిమా థియేటర్లలోకి వెళ్లింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని సచిన్ చెప్పారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సచిన్:ఏ బిలియన్ డ్రీమ్స్ అనే చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఒక పాట విడుదల సందర్భంగా సచిన్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సమయంలో ఆయనతోపాటు ఏఆర్ రెహ్మాన్ కూడా ఉన్నారు.