
ముంబై: భారత క్రికెట్‌లో సచిన్ సమున్నత శిఖరం. ఈ దిగ్గజానికి తండ్రి సందేశమే మార్గనిర్దేశమైంది. సచిన్ తండ్రి రమేశ్ టెండూల్కర్.. ఎంచుకున్న రంగంలో విజయవంతమయ్యేందుకు కష్టపడాలి తప్ప దగ్గరిదారులు (షార్ట్‌కట్స్) అంటూ ఉండవని సందేశమిచ్చారు. ఇప్పుడిదే సందేశాన్ని సచిన్... తన తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు ఇచ్చినట్లు చెప్పాడు. లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్జున్ ఇటీవలే ముగిసిన టీ20 ముంబై లీగ్‌లో ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్టర్న్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రూ.5 లక్షలకు టైగర్స్ ఫ్రాంచైజీ అతన్ని కొనుక్కుంది. ఈ జట్టు సెమీస్ దాకా పోరాడగా... అర్జున్ బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడు.
దీనిపై సచిన్‌ను సంప్రదించగా ‘అర్జున్‌కు క్రికెట్‌ను బలవంతంగా రుద్దలేదు. స్వతహాగానే అతనికి ఆటంటే ఆమితాసక్తి. నిజానికి మావాడు ఫుట్‌బాల్ ఆడేవాడు. తర్వాత చెస్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఇప్పుడేమో శ్రద్దగా క్రికెట్ ఆడుతున్నాడు. అయితే నేను చెప్పిందొక్కటే... జీవితంలో ఏది ఎంచుకున్నా అందుల్లో షార్ట్‌కట్స్ వెతక్కూడదు. విజయం సాధించేందుకు కష్టపడటం ఒక్కటే మార్గం. ఈ విషయాన్ని నా తండ్రి నాకు చెప్పాడు. నేను మావాడికి చెప్పా’ అని అన్నాడు. అందరి తల్లిదండ్రుల్లాగే తను కూడా తన కుమారుడు బాగా ఆడాలని కోరుకున్నట్లు చెప్పాడు. ఆటలో అయినా ఇంకేదైనా మన ప్రయత్నం మనం చేయాలని, కఠోరంగా శ్రమించాలని ఫలితం దేవుడి చేతుల్లో ఉంటుందని ‘మాస్టర్ బ్లాస్టర్’ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment