మీ బలహీనతను దాచేయండి: సచిన్
న్యూఢిల్లీ:ఏ మనిషికైనా బలం, బలహీనత ఉండటం సాధారణం. అయితే ప్రధానంగా ఆటగాళ్లు తమ బలహీనతల్ని కనబడనీయకుండా చేసినప్పుడే వారు విజయవంతం అవుతారని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. దాంతో పాటు సవాళ్లను, కష్ట నష్టాలను ఎదుర్కొనడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దని యువ క్రికెటర్లకు సచిన్ సూచించాడు.
ఫిబ్రవరి 26వ తేదీన నిర్వహించే న్యూఢిల్లీ మారథాన్ ఆరంభ కార్యక్రమానికి విచ్చేసిన సచిన్.. వర్ధమాను క్రికెటర్లకు పలు సూచనలు చేశాడు. 'ఎప్పుడూ మీ బలహీనతను బయటకు కనబడనీయకండి. ఒకసారి ప్రత్యర్థులకు మనం ఎక్కడ దొరికిపోతాయో తెలిసిందటే మళ్లీ మీరు తిరిగి పుంజుకోవడం కష్టమవుతుంది. ఒకసారి నా విషయంలో ఇదే జరిగింది. ఒకానొక సందర్భంలో నా పక్కటెములకు బంతి బలంగా తాకింది. అదే ఆయుధంగా బౌలర్ బంతుల్ని వేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో నాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. అక్కడ తీవ్ర గాయమైంది నాకు తెలుసు. కానీ ఆ విషయాన్ని బయటకు కనబడనీయలేదు. ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొనడం అలవాటు చేసుకోండి. ఒకసారి కష్టం వచ్చిందని ముందుకు ధైర్యంగా వెళ్లడం ఆపకండి' అని సచిన్ సూచించాడు. తన ఫిట్ నెస్ లో పరుగు అనేది కీలక పాత్ర పోషించిందని సచిన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.