సాక్షి, హైదరాబాద్: విజయ్ మర్చంట్ అండర్-16 క్రికెట్ టోర్నమెంట్‌లో బౌలర్లు సాయి శ్రాగ్వి (7/15), త్రిశాంక్ (6/39) విశేషంగా రాణించడంతో హైదరాబాద్ జట్టు ఘన విజయాన్ని సాధించింది. షిమోగాలో జరిగిన ఈ మ్యాచ్‌లో గోవాపై ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో గెలుపొందింది.
రెండో రోజు 13/0తో తొలి ఇన్నింగ్‌సను కొనసాగించిన గోవా జట్టు 33.1 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌటైంది. గౌరీశ్ భరత్ 41 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో రోహన్ 2, సాయి శ్రాగ్వి 7 వికెట్లు తీశారు. అనంతరం ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్‌స ను ప్రారంభించిన గోవా జట్టు 104 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో అభిషేక్ 2, త్రిశాంక్ 6 వికెట్లతో రాణించారు.