
కశ్యప్ సంచలనం
భారత బ్యాడ్మింటన్ యువ ఆటగాడు పారుపల్లి కశ్యప్.. ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సంచలనం సృష్టించాడు.
ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ క్వార్టర్స్‌లోకి ప్రవేశం
సైనా కూడా ముందుకు..
శ్రీకాంత్‌కు నిరాశ
జకార్తా: భారత బ్యాడ్మింటన్ యువ ఆటగాడు పారుపల్లి కశ్యప్.. ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ కశ్యప్ 21-11, 21-14తో ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హో (కొరియా)పై గెలిచి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. కేవలం 37 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ కుర్రాడు హవా కొనసాగించాడు. తొలి గేమ్‌లో 4-0 ఆధిక్యంలో నిలిచిన కశ్యప్... ప్రత్యర్థికి ఏమాత్రం పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. వరుసగా 13-4, 16-8, 20-9 స్కోరుతో నిలిచాడు.
ఈ దశలో సన్ రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నా.. కశ్యప్ అద్భుతమైన షాట్‌తో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్ ఆరంభంలో సన్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లినా.. కశ్యప్ 3-3, 6-6తో స్కోరును సమం చేశాడు. తర్వాత వరుసగా ఆరు పాయింట్లతో 12-6 ఆధిక్యాన్ని సాధిం చాడు. స్కోరు 13-10 ఉన్న దశలోనూ మరోసారి ఆరు పాయింట్లు గెలిచి 19-10తో నిలిచా డు. తర్వాత ఒక్కో పాయింట్‌తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో నాలుగోసీడ్ కిడాంబి శ్రీకాంత్ 21-14, 20-22, 13-21తో జింటింగ్ ఆంథోని (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు.
సైనా జోరు...
మహిళల సింగిల్స్‌లో సైనా జోరు కొనసాగుతోంది. ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్ సైనా 21-13, 21-15తో అన్‌సీడెడ్ సు యా చింగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గి క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 36 నిమిషాల మ్యాచ్‌లో హైదరాబాదీ సుదీర్ఘ ర్యాలీలు, బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లతో పాటు నెట్ వద్ద డ్రాప్ షాట్లతోనూ ఆధిపత్యం చూపెట్టింది. డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో జ్వాల-అశ్విని 8-21, 18-21తో ఏడో సీడ్ యు యాంగ్-జాంగ్ క్వినిక్సిన్ (చైనా) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌లో ప్రణవ్-అక్షయ్ 13-21, 11-21తో చాయ్ బియావో-హోంగ్ వీ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు.
పడిపోయిన సైనా ర్యాంక్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో సైనా నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోయింది. గురువారం తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆమెకు మూడో ర్యాంక్ దక్కింది. పురుషుల్లో శ్రీకాంత్ 3వ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, కశ్యప్ 12వ, ప్రణయ్ 13వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. జ్వాలా-అశ్విని జంటకు 17వ ర్యాంక్ లభించింది.