సైనా ఎనిమిదో‘సారీ’
న్యూఢిల్లీ: నిలకడలేమితో సతమతమవుతోన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో నిరాశ ఎదురైంది. మరోసారి ‘చైనా’ గోడను దాటలేక క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా 16-21, 14-21తో మూడో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. యిహాన్ వాంగ్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. వాంగ్‌తో జరిగిన పోరులో సైనా కీలక సమయాల్లో అనవసర తప్పిదాలకు పాల్పడి మూల్యం చెల్లించుకుంది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలిగేమ్‌లో ఒక దశలో 4-11తో వెనకబడిన సైనా.. ఆ తరువాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది.
అనంతరం స్కోరును 12-18కి, ఆపై 16-19కి తీసుకెళ్లగలిగినా యిహాన్ వరుసగా రెండు పాయింట్లతో గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌లోనూ 4-11 నుంచి 8-11కు చేరినా చివరిదాకా పోరాటం కొనసాగించలేకపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో పారుపల్లి కశ్యప్ (భారత్) పోరాటం కూడా ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) 21-15, 21-13తో కశ్యప్‌ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. లీ చోంగ్ వీ చేతిలో కశ్యప్‌కిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. సైనా, కశ్యప్ పరాజయాలతో ఈ టోర్నీలో భారత పోరాటం ముగిసింది.