india open super series tournment
-
జ్వాల జంట పరాజయం
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి జంట గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప నిరాశ పరిచింది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తొలి రౌండ్లోనే పరాజయం ఎదుర్కొంది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జ్వాల-అశ్విని పొన్నప్ప 16-21, 18-21తో ఆరో సీడ్ ఒయు డాంగ్‌ని-జియోహాన్ యు (చైనా) చేతిలో ఓడిపోయారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె ద్వయం కూడా ఓటమి పాలైంది. చాంగ్ యె నా-యు హె వన్ (దక్షిణ కొరియా) ద్వయం 21-13, 21-13తో సిక్కి-ప్రద్న్యా జంటపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి సీహెచ్ పూర్ణిమ-సృ్మతి నాగర్కోటి జంట 11-21, 10-21తో కుహూ గార్గ్-నింగ్సి బ్లాక్ హజారికా (భారత్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్‌కు చెందిన సంతోష్ రావూరి-కోనా తరుణ్ 21-14, 21-14తో ఉత్కర్ష్ అరోరా-అభినవ్ ప్రకాశ్ (భారత్)లపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఇతర మ్యాచ్‌ల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి 15-21, 11-21తో హిరోయుకి ఎండో-కెనిచి హయకావా (జపాన్)ల చేతిలో; మల్గారి అర్జున్ కుమార్ రెడ్డి-హేమనాగేంద్ర బాబు 18-21, 18-21తో క్రిస్నాంత డ్యానీ-త్రియాచార్ట్ చాయుట్ (సింగపూర్)ల చేతిలో ఓటమి చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-కోనా తరుణ్ 15-21, 21-17, 22-24తో త్రియాచార్ట్ చాయుట్-షింతా ములియా (సింగపూర్) చేతిలో, మనీషా-మనూ అత్రి 5-21, 16-21తో జోచిమ్ నీల్సన్-క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్) చేతిలో; హేమనాగేంద్ర బాబు-పూర్వీషా రామ్ 13-21, 16-21తో ప్రవీణ్ జోర్డాన్-డెబ్బీ సుసాంతో (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
సైనా ఎనిమిదో‘సారీ’
న్యూఢిల్లీ: నిలకడలేమితో సతమతమవుతోన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో నిరాశ ఎదురైంది. మరోసారి ‘చైనా’ గోడను దాటలేక క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా 16-21, 14-21తో మూడో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. యిహాన్ వాంగ్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. వాంగ్‌తో జరిగిన పోరులో సైనా కీలక సమయాల్లో అనవసర తప్పిదాలకు పాల్పడి మూల్యం చెల్లించుకుంది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలిగేమ్‌లో ఒక దశలో 4-11తో వెనకబడిన సైనా.. ఆ తరువాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. అనంతరం స్కోరును 12-18కి, ఆపై 16-19కి తీసుకెళ్లగలిగినా యిహాన్ వరుసగా రెండు పాయింట్లతో గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌లోనూ 4-11 నుంచి 8-11కు చేరినా చివరిదాకా పోరాటం కొనసాగించలేకపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో పారుపల్లి కశ్యప్ (భారత్) పోరాటం కూడా ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) 21-15, 21-13తో కశ్యప్‌ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. లీ చోంగ్ వీ చేతిలో కశ్యప్‌కిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. సైనా, కశ్యప్ పరాజయాలతో ఈ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. -
మెయిన్ ‘డ్రా’కు అజయ్ అర్హత
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కుర్రాడు అజయ్ కుమార్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సంపాదించాడు. సిరిఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అజయ్ 22-20, 23-21తో ఇటీవల జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన చాంపియన్ అరవింద్ భట్ (భారత్)ను బోల్తా కొట్టించాడు. అంతకుముందు తొలి రౌండ్లో ఈ హైదరాబాదీ 21-13, 21-15తో దీపక్ ఖత్రీ (భారత్)పై గెలిచాడు. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)తో అజయ్ తలపడతాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన చేతన్ ఆనంద్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. జాతీయ మాజీ చాంపియన్ అనూప్ శ్రీధర్ 21-14, 21-16తో చేతన్‌ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల- జిష్ణు సన్యాల్ జోడి క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగింది. రెండో అర్హత పోరులో గుత్తా జంట 12-21, 15-21తో తకెషి కముర-మిసాటో అరతమా (జపాన్) ద్వయం చేతిలో పరాజయం చవిచూసింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో జెంగ్‌మింగ్ వాంగ్ (భారత్)తో పారుపల్లి కశ్యప్; తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)తో గురుసాయిదత్; పెంగ్యూ డూ (చైనా)తో సాయిప్రణీత్; టకుమా (జపాన్)తో శ్రీకాంత్; జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో ఆనంద్ పవార్; లాంగ్ చెన్ (చైనా)తో ప్రణయ్; ఇవనోవ్ (రష్యా)తో సౌరభ్ వర్మ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సిమోన్ (ఆస్ట్రియా)తో సైనా నెహ్వాల్, షిజియాన్ వాంగ్ (చైనా)తో పి.వి.సింధు పోటీపడతారు. -
గాయాలు దాటి గాడిలోకి..
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌పై కశ్యప్ దృష్టి న్యూఢిల్లీ: గతంలో పదే పదే గాయాలు కావడంతో భవిష్యత్తుపై ఆందోళన చెందానని, అయితే ప్రస్తుతం వాటిని అధిగమించి ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీకి సిద్ధమయ్యానని భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ అన్నాడు. మంగళవారం (ఏప్రిల్ 1) నుంచి ఇండియా ఓపెన్ టోర్నీ జరగనున్న నేపథ్యంలో హైదరాబాదీ కశ్యప్ మాట్లాడుతూ... స్విస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరడం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. గత ఏడాది ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో కాలి మడమ గాయంతో మొదలుకొని కశ్యప్ వరుసగా గాయాలపాలయ్యాడు. ఫలితంగా పలు టోర్నీలకు దూరం కావాల్సి వచ్చింది. గత డిసెంబర్లో అయిన భుజం గాయం తిరిగి జర్మన్ ఓపెన్‌లో తిరగబెట్టింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనకు లోనయ్యానని కశ్యప్ తెలిపాడు. అయితే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో భుజానికి పట్టీ వేసుకొని ఆడడం సౌకర్యవంతంగా అనిపించిందని, స్విస్ ఓపెన్‌లోనూ అలాగే ఆడి సెమీస్‌కు చేరుకోగలిగానన్నాడు. ‘భుజానికి పట్టీతోనే స్విస్ ఓపెన్‌లో రాణించగలిగాను. దీంతో నొప్పి కూడా లేదు. మరో 4, 5 నెలలపాటు ఇలాగే ఆడాల్సి ఉంటుంద’ని కశ్యప్ అన్నాడు. ఇండియా ఓపెన్‌లో తొలిరౌండ్లోనే జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) వంటి గట్టి ప్రత్యర్థిని ఎదుర్కొనాల్సి రావడం పరీక్షేనని, అయితే ప్రస్తుతం తన ఫామ్‌తో అతణ్ని ఓడించగలనని కశ్యప్ ధీమా వ్యక్తం చేశాడు. ఇండియా ఓపెన్ తర్వాత కశ్యప్ ఏప్రిల్ 8 నుంచి 13 వరకు జరిగే సింగపూర్ ఓపెన్‌లో పాల్గొంటాడు.