జ్వాల జంట పరాజయం
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి జంట గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప నిరాశ పరిచింది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తొలి రౌండ్లోనే పరాజయం ఎదుర్కొంది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జ్వాల-అశ్విని పొన్నప్ప 16-21, 18-21తో ఆరో సీడ్ ఒయు డాంగ్ని-జియోహాన్ యు (చైనా) చేతిలో ఓడిపోయారు. మరో తొలి రౌండ్ మ్యాచ్లో తెలుగు అమ్మాయి సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె ద్వయం కూడా ఓటమి పాలైంది.
చాంగ్ యె నా-యు హె వన్ (దక్షిణ కొరియా) ద్వయం 21-13, 21-13తో సిక్కి-ప్రద్న్యా జంటపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్లో తెలుగు అమ్మాయి సీహెచ్ పూర్ణిమ-సృ్మతి నాగర్కోటి జంట 11-21, 10-21తో కుహూ గార్గ్-నింగ్సి బ్లాక్ హజారికా (భారత్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.
పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్కు చెందిన సంతోష్ రావూరి-కోనా తరుణ్ 21-14, 21-14తో ఉత్కర్ష్ అరోరా-అభినవ్ ప్రకాశ్ (భారత్)లపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఇతర మ్యాచ్ల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి 15-21, 11-21తో హిరోయుకి ఎండో-కెనిచి హయకావా (జపాన్)ల చేతిలో; మల్గారి అర్జున్ కుమార్ రెడ్డి-హేమనాగేంద్ర బాబు 18-21, 18-21తో క్రిస్నాంత డ్యానీ-త్రియాచార్ట్ చాయుట్ (సింగపూర్)ల చేతిలో ఓటమి చవిచూశారు.
మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-కోనా తరుణ్ 15-21, 21-17, 22-24తో త్రియాచార్ట్ చాయుట్-షింతా ములియా (సింగపూర్) చేతిలో, మనీషా-మనూ అత్రి 5-21, 16-21తో జోచిమ్ నీల్సన్-క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్) చేతిలో; హేమనాగేంద్ర బాబు-పూర్వీషా రామ్ 13-21, 16-21తో ప్రవీణ్ జోర్డాన్-డెబ్బీ సుసాంతో (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు.