సైనా శ్రమించి... | saina sails into semi final of malaysian open | Sakshi
Sakshi News home page

సైనా శ్రమించి...

Published Sat, Apr 4 2015 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

సైనా శ్రమించి...

సైనా శ్రమించి...

మలేసియా ఓపెన్‌లో సెమీస్‌కి
నేడు లీ జురుయ్‌తో కీలక పోరు
 మలేసియా ఓపెన్సెమీఫైనల్స్ ఉ.గం. 10.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం
 
 కౌలాలంపూర్: ‘చైనా’ రెండో పరీక్షలో సైనా నెహ్వాల్ నెగ్గింది. అయితే కాస్త శ్రమించి... అనుభవాన్ని రంగరించి... మలేసియా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సైనా 21-11, 18-21, 21-17తో ప్రపంచ 15వ ర్యాంకర్ సున్ యు (చైనా)పై విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనాకు రెండు, మూడు గేముల్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయితే ఈ హైదరాబాద్ అమ్మాయి కీలకదశలో తన అనుభవాన్ని ఉపయోగించి వరుస పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. తన కెరీర్‌లో సున్ యుపై సైనాకిది వరుసగా మూడో విజయం. నిరుడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో సున్ యుపై సైనా నెగ్గింది. ప్రస్తుత మలేసియా ఓపెన్‌లో చైనా ప్లేయర్‌పై సైనాకిది వరుసగా రెండో విజయం. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో చైనాకే చెందిన ప్రపంచ 70వ ర్యాంకర్ జుయ్ యావోను సైనా ఓడించిన సంగతి తెలిసిందే. సెమీఫైనల్లోనూ సైనా ప్రత్యర్థిగా చైనా ప్లేయరే ఉండటం విశేషం. శనివారం జరిగే సెమీస్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, లండన్ ఒలింపిక్స్ విజేత, టాప్ సీడ్ లీ జురుయ్‌తో సైనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 2-8తో వెనుకబడి ఉండటం గమనార్హం. 2012 ఇండోనేసియా ఓపెన్ ఫైనల్లో చివరిసారిగా లీ జురుయ్‌ను సైనా ఓడించింది. ఆ తర్వాత వీరిద్దరూ నాలుగుసార్లు తలపడగా... సైనాకు ఒక్కసారి కూడా విజయం దక్కలేదు. సెమీఫైనల్లో సైనా ఓడిపోతే వచ్చే వారం ఆమె ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయే అవకాశం ఉంది.
 
 గత నెలలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో సున్ యును అలవోకగా ఓడించిన సైనా ఈసారీ దూకుడుగానే ప్రారంభించింది. తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ 12-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. అయితే రెండో గేమ్‌లో సైనా ఆటతీరు ఒక్కసారిగా గాడి తప్పింది. ఒకదశలో 8-14తో వెనుకబడిన సైనా అనూహ్య ఆటతీరుతో పుంజుకొని వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి స్కోరును 14-14 వద్ద సమం చేసింది. అయితే మళ్లీ సున్ యు తేరుకొని కీలకదశలో పాయింట్లు సాధించి రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా కోలుకొని నిలకడగా ఆడుతూ పాయింట్లు సంపాదించి 14-8తో ముందంజ వేసింది. ఇక సైనా విజయం ఖాయమనుకుంటున్న తరుణంలో సున్ యు పోరాటపటిమ కనబరిచి వరుసగా ఆరు పాయింట్లు సాధించి స్కోరును 14-14 వద్ద సమం చేసింది. ఆ తర్వాత సైనా 16-17తో ఒక పాయింట్‌తో వెనుకబడింది. ఇక విజయం కోసం హోరాహోరీ తప్పదనుకుంటున్న తరుణంలో సైనా జూలు విదిల్చింది. సున్ యు ఆట కట్టిస్తూ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 21-17తో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకొని సెమీఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ లీ జురుయ్ 14-21, 21-15, 21-12తో ఐదో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)పై, రెండో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) 21-19, 15-21, 22-20తో ఒకుహారా (జపాన్)పై, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) 21-12, 21-9తో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)పై గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement