ఇంటర్ స్కూల్ టీటీ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో సెయింట్ పాల్స్ స్కూల్ జట్లు సత్తా చాటాయి. మలక్‌పేట్‌లోని స్టాగ్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో జూనియర్, సీనియర్ బాలుర టీమ్ విభాగాల్లో విజేతగా నిలిచి టైటిళ్లను దక్కించుకున్నాయి. బుధవారం జరిగిన జూనియర్ బాలుర టీమ్ ఈవెంట్‌లో సెయింట్ పాల్స్ హైస్కూల్ 3–1తో చిరెక్ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది. సెయింట్ పాల్స్ తరఫున జతిన్ 3–2తో అథర్వపై, త్రిశూల్ 3–2తో ఆయుశ్‌పై, త్రిశూల్ 3–2తో అథర్వపై గెలుపొందారు. సీనియర్ బాలుర టీమ్ ఫైనల్లోనూ సెయింట్ పాల్స్ హైస్కూల్ జట్టు 3–1తో ప్రకాశం విద్యానికేతన్ హైస్కూల్‌ను ఓడించింది. విజేత జట్టు తరఫున అనూప్ 3–1తో రాజుపై, యశ్ 3–0తో నితిన్‌పై, అనూప్ 3–0తో నితిన్‌పై విజయం సాధించారు.
బాలికల విభాగంలో చిరెక్ ఇంటర్నేషనల్, గీతాంజలి దేవాశ్రయ్ జట్లు విజేతలుగా నిలిచాయి. జూనియర్ బాలికల టీమ్ ఈవెంట్ ఫైనల్లో చిరెక్ పబ్లిక్ స్కూల్ (కొండాపూర్) 3–0తో సెయింట్ పాల్స్ హైస్కూల్‌పై నెగ్గింది. చిరెక్ తరఫున సింగిల్స్ మ్యాచ్‌ల్లో అనన్య 3–0తో ఆశ్లేషపై, పూజ 3–2తో ప్రియాంక రాజ్‌పై గెలుపొందగా, డబుల్స్ కేటగిరీలో అనన్య–పూజ ద్వయం 3–0తో ఆశ్లేష–ప్రియాంక రాజ్ జంటపై నెగ్గింది. సీనియర్ బాలికల ఫైనల్లో గీతాంజలి దేవాశ్రయ్ 3–2తో రోజరీ కాన్వెంట్ హైస్కూల్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. గీతాంజలి జట్టులో భవిత 3–1తో కీర్తనపై, 3–0తో ఇక్షితపై విజయం సాధించగా, డబుల్స్ కేటగిరీలో విధి– భవిత జంట 3–1తో ఇక్షిత–కీర్తన జోడీపై నెగ్గింది.