
రాబిన్ ఊతప్ప, శీతల్‌తో సాక్షి ధోని (ఇన్‌స్టాగ్రామ్ ఫొటో)
క్రికెటర్ రాబిన్ ఊతప్పకు మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షి ధోని ధన్యవాదాలు తెలిపారు.
ముంబై: క్రికెటర్ రాబిన్ ఊతప్పకు మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షి ధోని ధన్యవాదాలు తెలిపారు. మహి, తనను కలిపింది అతడేనని వెల్లడించి, ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. సాక్షి తన 30వ పుట్టిన రోజు వేడుకలను ముంబైలోని ఓ హోటల్‌లో ఇలీవల జరుపుకున్నారు. ఈ పార్టీకి రాబిన్ ఊతప్పతో పాటు హార్థిక్ పాండ్యా, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. ధోని కూతురు జీవా ఈ పార్టీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ప్రముఖ గాయకుడు రాహుల్ వైద్య పలు బాలీవుడ్ హిట్ సాంగ్స్ పాడి అలరించారు. సాక్షి, పాండ్యా కూడా రాహుల్‌తో కలసి ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలోని ‘చన్నా మేరాయా’ పాట ఆలపించారు. పార్టీ పూర్తయ్యాక తన పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. రాబిన్ ఊతప్ప, అతడి భార్య శీతల్ గౌతమ్‌తో కలిసివున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2010లో ధోని, సాక్షి పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కూతురు జీవా ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో ధోని అంతర్జాతీయ కెరీర్‌కు బ్రేక్ పడింది. 2018 సంవత్సరం ధోని కెరీర్‌లో అత్యంత చెత్తగా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడి కేవలం 275 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 42 నాటౌట్. 2019 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు కొద్ది నెలల సమయం మాత్రమే ఉండటంతో ధోని ఫామ్ టీమిండియాను కలవరపెడుతోంది.