లేడీ ‘సుల్తాన్’ | Sakshi Malik's Bronze medal triggers | Sakshi
Sakshi News home page

లేడీ ‘సుల్తాన్’

Published Fri, Aug 19 2016 2:07 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

లేడీ ‘సుల్తాన్’

లేడీ ‘సుల్తాన్’

ఒకప్పుడు ఆ అమ్మాయి ఆకాశంలో వెళ్లే విమానాలు చూసి జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కితే చాలనుకుంది...

ఒకప్పుడు ఆ అమ్మాయి ఆకాశంలో వెళ్లే విమానాలు చూసి జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కితే చాలనుకుంది... కానీ విమానాలు కూడా అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది.  ఒక మహిళా రెజ్లర్ ట్రోఫీ అందుకుంటున్న ఫొటోను పత్రికలో చూసి తానూ అలాగే కావాలని భావించింది. ఇప్పుడు దేశంలోని పత్రికలన్నీ ఆమె నామజపంతోనే నిండిపోయే ఘనతను సాధించింది. ప్రతిభకు లోటు లేకున్నా, చాలా కాలంగా ఫోగట్ సిస్టర్స్ నీడలోనే ఉండిపోయిన ఆ రెజ్లర్ ఇప్పుడు తన పట్టును ప్రదర్శించింది. కోట్లాది భారతీయులు గర్వపడేలా విశ్వ వేదికపై త్రివర్ణాన్ని రెపరెపలాడించింది.

 

మోఖ్రా నుంచి సాక్షి టీవీ ప్రతినిధి ఎన్.వెంకటేష్
అమ్మాయిల భ్రూణహత్యలకు నెలవైన హరియాణా నుంచి మరో ఆడపిల్ల ఆటల్లో ప్రపంచాన్ని గెలిచింది. ఆర్థిక పరంగా కష్టాలు, కన్నీళ్లవంటి కథలేమీ ఆమె వెనక లేకపోవచ్చు. కానీ క్రీడాకారిణిగా 12 ఏళ్లుగా ఆమె చేసిన పోరాటం, శ్రమ ఎవరికంటే తక్కువ కాదు. అమ్మాయికి ఈ ఆట ఎందుకు అని సొంత ఊరినుంచే వెక్కిరింతలు వచ్చిన చోట ఇప్పుడు ‘వో హమారీ బేటీ’ ఊరు ఊరంతా గర్వపడేలా చేయడం సాక్షి  సాధించిన గొప్ప విజయం.

 
తల్లిదండ్రుల అండతో: రెజ్లింగ్‌లాంటి క్రీడను ఆడపిల్ల ఎంచుకోవడమే పెద్ద సాహసం. బయటివాళ్ల మాటలు సరేసరే... చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులే దీనిని వ్యతిరేకించే పరిస్థితి. అయితే తమ అమ్మాయి కోరికకు ఆమె తల్లిదండ్రులు మద్దతు తెలపడంతో సాక్షికి మొదటి అడ్డంకి తొలగిపోయింది. ఢిల్లీ ఆర్టీసీలో కండక్టర్ అయిన తండ్రి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ అయిన తల్లి తమ కూతురి లక్ష్యానికి అండగా నిలిచారు. కుస్తీ అంటే సాక్షి మలిక్‌కు అమిత ఇష్టం. దాంతోపాటు... తినడం కూడా బాగా ఇష్టం. ముగ్గురు తినే తిండి, ముగ్గురు తాగే పాలు... చిన్నప్పటి సాక్షికి ప్రియమైన వ్యాపకం. తన స్వస్థలం మోఖ్రాకు సమీపంలోని రోహ్‌టక్‌లో ఆమె 12 ఏళ్ల వయసులో ఈశ్వర్ దహియా అనే కోచ్ వద్ద శిక్షణకు సిద్ధమైంది. సాక్షి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబం పూర్తిగా రోహ్‌టక్‌కు మారిపోయింది. ఆరేళ్ల కష్టం తర్వాత 2010లో జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచి తొలి సారి తన ఆటతో ఆనందాన్ని అందుకుంది. 

 
అంచనాలు లేకుండానే...: సీనియర్ విభాగంలో 2013 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించడంతో సాక్షి రెజ్లింగ్ ప్రపంచంలో నిలదొక్కుకోగలిగింది. అయితే ఆ తర్వాత కూడా ఆమె అనామకురాలే. భారత మహిళల రెజ్లింగ్‌లో ఫోగట్ కుటుంబం తర్వాత మరొకరి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. బహుశా ఏ ఒత్తిడి లేకపోవడం కూడా ఆమెకు రియోలో కూడా కలిసొచ్చినట్లుంది! అదృష్టవశాత్తూ ఈ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మలిక్...కఠోర సాధన చేసింది. ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావడంతో జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ ఆమెకు అండగా నిలిచింది. తన ఈవెంట్‌లో అద్భుత పోరాటపటిమ కనబరుస్తూ చివరి పది సెకన్లలో సీన్ ‘రివర్స్’ చేసి సగర్వంగా సింహనాదం చేసింది.

 
మహా మాస్: ఆట కోసం ఎంతైనా కష్టపడే స్వభావం ఉన్న ఈ రెజ్లర్ మాటతీరులో మాత్రం భోళాతనం కనిపిస్తుంది. పతకం గెలిచిన తర్వాత ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఎక్కడా తెచ్చి పెట్టుకున్న హుందాతనం లేదు. తన భాషలో, తనదైన శైలిలోనే మాట్లాడుతూ పోయింది. ఆరు నిమిషాలు నిలబడితే చాలు గెలుస్తానని నమ్మాను అని చెప్పడం 24 ఏళ్ల సాక్షి ఆత్మవిశ్వాసానికి సంకేతం. చిన్నప్పుడు చాలా అల్లరి చేసి నా... రెజ్లర్ అయిన తర్వాత చాలా గంభీరంగా మారి పోయిందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. చదువుల్లోనూ చురుగ్గా ఉండే సాక్షి 70 శాతం మార్కులతో మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ను పూర్తి చేయడం విశేషం. ఇంటీరియర్ డిజైనింగ్‌పై ఆసక్తి కనబర్చే తన అభిరుచి ప్రకారం ఇంటిని అలంకరించుకుంది. సిని మాలు, స్నేహితులతో కలిసి తిరగడంపై ఆసక్తి లేదు. ఖాళీ దొరికితే ఇంట్లో ఉండటాన్నే ఇష్టపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement