కుప్పకూలిన డేర్ డెవిల్స్
మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో మరో అత్యల్ప స్కోరు నమోదైంది. ఆదివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 67 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది ఢిల్లీ. ఈ రోజు మ్యాచ్ లో క్రీజ్లోకి వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లే పెవిలియన్ చేరడంతో ఢిల్లీ స్వల్పలక్ష్యాన్ని మాత్రమే నిర్దేశింది. సంజూ శాంసన్(5), శ్యామ్ బిల్లింగ్స్(0), కరుణ్ నాయర్(11),అయ్యర్(6), రిషబ్ పంత్(3), క్రిస్ మోరిస్(2), రబడా(11), మొహ్మద్ షమీ(2), నదీమ్(0)లు తీవ్రంగా నిరాశపరచగా, కోరీ అండర్సన్(18) టాప్ స్కోరర్ గా నిలిచాడు. కింగ్స్ పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ నాలుగు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించగా, వరుణ్ అరోన్, అక్షర్ పటేల్లు తలో రెండు వికెట్లతో సత్తా చాటారు. మ్యాక్స్ వెల్, మోహిత్ శర్మలకు చెరో వికెట్ దక్కింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ ఆఖరి బంతికి శ్యామ్ బిల్లింగ్స్ డకౌట్ గా అవుటై నిరాశపరిచాడు.ఆ పై సంజూ శాంసన్ కూడా నిష్క్రమించడంతో ఢిల్లీ ఏడు పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.ఆ తరుణంలో కరుణ్ నాయర్-అయ్యర్లు కాసేపు ప్రతిఘటించే యత్నం చేసినప్పటికీ స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్ చేరారు. దాంతో 25 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ ఇక తేరుకోలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ కింగ్స్ కు దాసోహమైంది. ఏ దశలోనూ కింగ్స్ కు దీటుగా సమాధానం ఇవ్వలేకపోయిన ఢిల్లీ 17.1 ఓవర్లలోనే వికెట్లను సమర్పించుకుంది.