ప్లే ఆఫ్ రేసులో నిలిచేదెవరో?
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్-రైజింగ్ పుణె జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇది ఇరు జట్లకు చివరి లీగ్ కావడంతో పాటు ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసే మ్యాచ్ కావడంతో దీనికి అధిక ప్రాధ్యాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్ లో పుణె గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ ఓటమి పాలైతే మాత్రం పుణె నాకౌట్ కు చేరడం కష్టమే.
ప్రస్తుతం రన్ రేట్ ప్రకారం కింగ్స్ పంజాబ్ కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరే నాల్గో జట్టుగా నిలుస్తుంది. ఇక్కడ ఇరు జట్లకు గెలుపు అనేది ముఖ్యం కావడంతో హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. గత మ్యాచ్ లో ఢిల్లీపై పుణె ఓడిపోవడంతో ఆ జట్టుకు ఇది కీలక మ్యాచ్ గా మారిపోయింది. మరొకవైపు వరుస విజయాలతో కింగ్స్ పంజాబ్ చెలరేగిపోవడంతో పుణెను కలవర పెడుతోంది. కచ్చితంగా గెలవాల్సిన రెండు వరుస మ్యాచ్ ల్లో కింగ్స్ విజయం సాధించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పుణె తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత కింగ్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.