పది నెలలుగా సచిన్‌ను కలవలేదు! | Sandip Patil rubbishes reports of Sachin Tendulkar's retirement | Sakshi
Sakshi News home page

పది నెలలుగా సచిన్‌ను కలవలేదు!

Published Thu, Sep 19 2013 12:47 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

పది నెలలుగా సచిన్‌ను కలవలేదు!

పది నెలలుగా సచిన్‌ను కలవలేదు!

ముంబై:  సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు తర్వాత అతని భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని, ఇదే విషయాన్ని మాస్టర్‌కు స్వయంగా చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ కలిసి చెప్పినట్లు మీడియాలో వచ్చిన కథనాన్ని పాటిల్ కొట్టి పారేశారు. అసలు తాను సచిన్‌ను కలిసి దాదాపు పది నెలలు అయిందని ఆయన అన్నారు. మాస్టర్ గొప్పతనాన్ని తగ్గించలేమని...అయితే ప్రతిభ గల యువ ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుంటూ తాము భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తున్నామని, ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ సచిన్‌కు వివరించినట్లు కూడా ఈ కథనంలో ఉంది.
 
 ఒక సెలక్టర్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు కూడా ఓ పత్రిక రాసింది. ‘సచిన్‌ను కలవడాన్ని నేను ఎప్పుడైనా ఇష్ట పడతాను. కానీ దాదాపు 10 నెలలుగా నేను అతడిని కలవలేదు. అతను నాకు గానీ, నేను సచిన్‌కు గానీ కనీసం ఫోన్ కూడా చేయలేదు. మేం ఏ విషయాన్నీ చర్చించలేదు. ఆ వార్త అంతా శుద్ధ అబద్ధం’ అని సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. మరో వైపు బీసీసీఐ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని వివరణ ఇచ్చింది. ‘మేం అటు సచిన్‌తో, ఇటు పాటిల్‌తో కూడా మాట్లాడాం. వారిద్దరి మధ్య ఎలాంటి చర్చా జరగలేదు. రిటైర్మెంట్‌పై స్వయంగా ఆటగాడే నిర్ణయం తీసుకోవాలనేది బోర్డు పాలసీ. దానిని ఎల్లప్పుడూ అనుసరిస్తూనే ఉన్నాం’ అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. సచిన్ వచ్చే నవంబరులో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో 200 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు.
 
 అతడినే నిర్ణయించుకోనివ్వండి : కిర్మాణీ
 బెంగళూరు: రిటైర్మెంట్ నిర్ణయాన్ని సచిన్‌కే వదిలేయాలని భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అభిప్రాయ పడ్డారు. 200వ టెస్టు తర్వాత రిటైర్ అవుతాడనే వార్తలు ఎందుకు సృష్టిస్తారో అర్థం కాదని ఆయన అన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement