సచిన్ నన్ను ఆపాడు: సెహ్వాగ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కు 2007లోనే వీడ్కోలు చెప్పాలనుకున్నానని టీమిండియా వెటరన్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. అయితే సచిన్ టెండూల్కర్ తనను వారించడంతో ఇప్పటివరకు క్రికెట్ లో కొనసాగానని వెల్లడించాడు. తన 37వ పుట్టినరోజు నాడు(అక్టోబర్ 20) అంతర్జాతీయ క్రికెట్ కు వీరూ గుడ్ బై చెప్పాడు.
' ఇంటర్నేషనల్ కెరీర్ ఉచ్ఛదశలో ఉన్నప్పుడే రిటైర్ కావాలని ప్రతి ఆటగాడు కోరుకుంటాడు. నేను కూడా అలాగే రిటైర్ కావాలనుకున్నా. కానీ విధి నన్ను మరికొంత కాలం క్రికెట్ ఆడేలా చేసింద'ని సెహ్వాగ్ 'జీ న్యూస్'తో చెప్పాడు. 2013, మార్చిలో వీరూను జట్టు నుంచి తొలంగించారు. తర్వాత అతడికి జట్టులో చోటు దక్కలేదు.
2013లో ఆస్ట్రేలియా సిరీస్ నుంచి తప్పించినప్పుడు తన భవిష్యత్ ప్రణాళిక గురించి సెలెక్టర్లు తనను అడగలేదని తెలిపాడు. ఒకవేళ అడిగితే రిటైర్మెంట్ ప్రకటించే వాడినని అన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్ బై చెప్పడంతో తన ఇద్దరు కొడుకులు అప్ సెట్ అయ్యారని సెహ్వాగ్ తెలిపాడు.