సచిన్, ఎంఎస్ ధోని (ఫైల్ ఫొటో)
ముంబై : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారు. ఇటీవల వన్డే సిరీస్‌లో ధోని విఫలమైన కారణంగానే ఇంగ్లండ్ చేతిలో భారత్ సిరీస్ కోల్పోయిందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ధోనికి రిటైర్మెంట్ సమయం వచ్చిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. తన కెప్టెన్(2011 వన్డే వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్) ధోనికి మద్దతుగా నిలిచిన సచిన్ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ.. ఆట నుంచి ఎప్పుడు తప్పుకోవాలో అతడికి తెలుసు అన్నారు.
తాజా సిరీస్‌లో ధోని రాణించపోయినా, అతడిలో ఆడే సత్తా ఉంది. ఆటగాడికి తనపై పూర్తి విశ్వాసం ఉన్నంతకాలం ఆటలో కొనసాగవచ్చు. జట్టులో తీసుకునే సమయంలో మాత్రమే ఆటగాడి చేతిలో నిర్ణయం ఉండదు. కానీ రిటైర్మెంట్ విషయంలో ఆటగాళ్లకు స్వేచ్ఛ ఉంటుంది. ధోని చాలాకాలం క్రికెట్‌ను ఆస్వాదించాడు. ఇతరుల కంటే ఆటను చాలా బాగా అంచనా వేయగల సామర్థ్యం ధోని సొంతం. అతడితో కలిసి క్రికెట్ ఆడాను కనుక కెరీర్‌కు ఎప్పుడు గుడ్‌బై చెప్పాలన్న నిర్ణయం నా కెప్టెన్ ఎంఎస్ ధోనికి వదిలేయం ఉత్తమమని’ వివరించారు.
ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరిగిన చివరి వన్డే అనంతరం అంపైర్ల నుంచి ధోని బంతిని తీసుకోవడంతో ఈ మాజీ కెప్టెన్ రిటైర్ అవుతున్నట్లు వదంతులు ప్రచారమయ్యాయి. మరోవైపు సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీలు సైతం ఆడితేనే జట్టులో ఉంటావని ధోనికి చురకలు అంటిస్తున్న విషయం తెలిసిందే. చిరకాల వాంఛ అయిన వన్డే వరల్డ్‌కప్‌ను ఎంఎస్ ధోని సారథ్యంలో 2011లో సచిన్ సాకారం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment