పుణే: దిగ్గజ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తానూ అనుకున్నానని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. అయితే ఇన్నేళ్ల అద్భుత కెరీర్ తర్వాత తన ఇష్టానికి అనుగుణంగా రిటైర్ కావడం మంచి విషయమని అతను వ్యాఖ్యానించాడు. ‘ఆ రోజు వస్తుందని నాకు తెలుసు. అయితే ఎంతో కాలం అగ్ర స్థానంలో ఉంటూ దాదాపు 24 ఏళ్లు ఆడగలగడం సంతోషాన్నిచ్చే విషయం. పైగా తాను అనుకున్నప్పుడే సచిన్ రిటైర్ అవుతున్నాడు’ అని భారత కెప్టెన్ స్పందించాడు.
అయితే మనసులో ఏదో ఒక చోట ఇక సచిన్ ఆటను చూడలేమనే బాధ అందరితో పాటు తనకూ ఉందన్నాడు. భారత అభిమానులందరి అంచనాల భారాన్ని మోస్తూ గొప్పగా రాణించడం అతనికే సాధ్యమైందన్నాడు. జట్టు టాప్ బ్యాట్స్‌మన్ ఆడినా, ఆడకపోయినా అతని ఆటపై అందరికీ దృష్టి ఉంటుందని కెప్టెన్ అన్నాడు. సచిన్ చివరి రెండు టెస్టులు హౌస్‌ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ధోని చెప్పాడు. ‘ఆ రెండు టెస్టులు మనం పూర్తిగా ఆస్వాదించాలి.
రెండు వేదికల్లోనూ ప్రేక్షకులు భారీగా రావాలి. టెస్టు మ్యాచ్ కోసం స్టేడియం నిండిపోవడాన్ని నేను చూడాలని అనుకుంటున్నాను. అలా జరగకపోతే వచ్చే 25-30 ఏళ్లలో కూడా నేను టెస్టు కోసం స్టేడియం నిండటం చూడలేను’ అని ధోని వ్యాఖ్యానించాడు. వన్డేల్లో ప్రత్యర్థి బౌలర్‌ను ఎలా లక్ష్యంగా చేసుకోవాలి, కఠిన పరిస్థితుల్లో ఎలా ఆడాలి...ఇలా చాలా విషయాలు సచిన్ వద్దే నేర్చుకున్నానన్న ధోని...ఇంకా ఎంతో ఉన్నా, సమయాభావం వల్ల చెప్పలేనని అన్నాడు.
ఆ రోజు రానుందని తెలుసు!
Published Sun, Oct 13 2013 1:04 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
Advertisement