చెన్నై: 2011 సంవత్సరం... ఎమ్మెస్ ధోని నాయకత్వంలో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ గెలుచుకొని నీరాజనాలందుకుంది. కెప్టెన్‌గా ధోని శిఖరాన నిలిచాడు. అయితే ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇంగ్లండ్ చేతిలో 0–4తో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా... ఆ తర్వాత కొద్ది రోజులకే ఆస్ట్రేలియా చేతిలో కూడా ఇదే తరహాలో 0–4తో పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ సమయంలో ధోని నాయకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో టెస్టు సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ధోనిని కెప్టెన్సీనుంచి తప్పించాలని సెలక్టర్లు భావించారు. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నాటి అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ దీనిని అడ్డుకున్నారు.
తన విశేషాధికారాలు ఉపయోగించి ధోనిని కెప్టెన్‌గా కొనసాగేలా చేశారు. ఈ విషయంలో శ్రీనివాసన్ పాత్రపై అనేక సార్లు వార్తలు వచ్చినా... ఇంత కాలం ఆయన నోరు విప్పలేదు. ఇప్పుడు ధోని రిటైర్మెంట్ అనంతరం దీనిని శ్రీనివాసన్ ధ్రువీకరించారు. తానే ఎమ్మెస్ కెప్టెన్సీ కోల్పోకుండా ఆపినట్లు వెల్లడించారు. ఐపీఎల్ ప్రారంభమైన తొలి ఏడాది 2008నుంచే శ్రీనివాసన్‌కు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్‌గా ధోని వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డునుంచి జరిగే ప్రతీ ఎంపికకు అధ్యక్షుడు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ‘ధోనిని వన్డే జట్టు కెప్టెన్సీనుంచి తొలగించాలని ఒక సెలక్టర్ (మొహీందర్ అమర్‌నాథ్) భావించారు. అసలు అతడిని ఎలా తప్పించగలరనేదే నా ప్రశ్న. కొన్నాళ్ల క్రితమే ధోని ప్రపంచ కప్ గెలిపించాడు.అసలు అతని స్థానంలో ఎవరిని కెప్టెన్ చేయాలో కూడా వారికి తెలీదు. అసలు సమావేశానికి ముందు నేను ధోని కెప్టెన్ కాకపోవడం అనే మాటే ఉదయించదని స్పష్టంగా చెప్పేశాను. సెలవు రోజున నేను గోల్ఫ్ ఆడుతున్న సమయంలో అప్పటి బోర్డు కార్యదర్శి సంజయ్ జగ్దాలే నాకు ఈ విషయం తెలియజేశారు. సెలక్టర్లు ఇంకా కెప్టెన్‌గా ఎంపిక చేయలేదు. ధోనిని ఆటగాడిగా మాత్రమే తీసుకుంటామంటున్నారని నాతో ఆయన చెప్పారు. నేను వెంటనే నాకున్న అన్ని అధికారాలను ఉపయోగించాను’ అని శ్రీనివాసన్ గుర్తు చేసుకున్నారు. ధోని తనకు నచ్చినంత కాలం చెన్నై జట్టు తరఫున ఆడవచ్చని ఆయన హామీ ఇచ్చారు.
7, 3 కలిస్తే 73..!
స్వాతంత్య్ర దినోత్సవంనాడు ధోని రిటైర్మెంట్‌ను ప్రకటిస్తాడనే విషయం తనకు ముందే తెలుసని అతని సహచరుడు, అదే రోజు రిటైర్ అయిన సురేశ్ రైనా అన్నాడు. దానికి అనుగుణంగానే తాను కూడా సిద్ధమైనట్లు అతను చెప్పాడు. ‘చెన్నై చేరగానే ధోని వీడ్కోలు విషయాన్ని చెబుతాడని తెలుసు. రిటైర్మెంట్ ప్రకటన అనంతరం మేమిద్దరం భావోద్వేగాలు ఆపుకోలేక గట్టిగా హత్తుకున్నాం. చెన్నై జట్టులోని ఇతర ఆటగాళ్లందరితో కలిసి రాత్రంతా ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నాం. పార్టీ చేసుకున్నాం’ అని రైనా వెల్లడించాడు. సుమారు ఏడు నెలల విరామంతో ధోని, రైనాలిద్దరు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టారు. భారత జట్టుతో పాటు ఐపీఎల్‌లో చెన్నై జట్టు సభ్యులుగా వీరిద్దరి మధ్య ఎంతో ఆత్మీయత ఉంది. ‘ఆగస్టు 15న రిటైర్ కావాలని మేమిద్దరం ముందే నిర్ణయించుకున్నాం. ధోని జెర్సీ నంబర్ 7, నా జెర్సీ నంబర్ 3 ఒక చోట చేరిస్తే 73 అవుతుంది. శనివారంనాటికి మనకు స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంతకంటే తగిన సమయం లేదని భావించాం’ అని రైనా వివరించాడు.
‘నేను.. ధోనిని మాట్లాడుతున్నా’
కెరీర్ ఆరంభంలో చాలా మందిలాగే బ్యాట్ స్పాన్సర్‌షిప్ కోసం ధోని కూడా బాగా ఇబ్బందులు పడ్డాడు. రాంచీలోని ఒక డీలర్ పరమ్‌జిత్ సింగ్ అతనిలోని ప్రతిభను గుర్తించి ఆరు నెలల పాటు ఆఅSS (బీట్ ఆల్ స్పోర్ట్స్) కంపెనీ వెంట పడటంతో చివరకు జలంధర్‌కు చెంది ఆ సంస్థ యజమాని సోమి కోహ్లి అందుకు అంగీకరించాడు. 1998లో ధోనితో ఈ సంస్థ ప్రయాణం మొదలు కాగా ఆరేళ్ల తర్వాత గానీ కోహ్లితో ధోని భేటీ జరగలేదు. 2004లో ఒక సారి బ్యాట్‌లను ఎంచుకునేందుకు జలంధర్ వెళ్లిన ధోని ఆ రాత్రి కోహ్లి ఇంట్లోనే ఆగాడు.
ధోనిని కోహ్లి పరిచయం చేయగా... ఆయన భార్య ‘ఎవరితను’ అని ఎదురు ప్రశ్నించింది. తర్వాతి రోజు ఉదయం ధోని ‘సర్, ఆమె మాటలతో నేను రాత్రంతా నిద్రపోలేకపోయాను’ అని కోహ్లితో చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత వైజాగ్‌లో పాకిస్తాన్‌పై అద్భుత సెంచరీ చేసిన తర్వాత అదే రోజు రాత్రి 11 గంటలకు కోహ్లికి ఫోన్ చేసిన ధోని...‘ఆంటీ, నేను ధోనిని మాట్లాడుతున్నా’ అన్నాడు. బిడ్డా, ఇప్పుడు నేనే కాదు ప్రపంచమంతా నిన్ను గుర్తిస్తుంది అని ఆమె ఆశీర్వదించింది. ఆ తర్వాత ప్రముఖ కంపెనీలతో ధోని ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆఅS కంపెనీ మాత్రం బ్యాట్లు పంపడం ఆపలేదు. గత ఏడాది ప్రపంచకప్‌లో తనకు అండగా నిలిచిన అన్ని కంపెనీల లోగోలు కనిపించే విధంగా వేర్వేరు బ్యాట్లతో ఆడి ధోని తన కృతజ్ఞతను ప్రదర్శించాడు.
Comments
Please login to add a commentAdd a comment