రాముడి బాటలో లక్ష్మణుడు... | Suresh Raina Announced About His Retirement For International Cricket | Sakshi
Sakshi News home page

రాముడి బాటలో లక్ష్మణుడు...

Published Sun, Aug 16 2020 3:59 AM | Last Updated on Sun, Aug 16 2020 10:02 AM

Suresh Raina Announced About His Retirement For International Cricket - Sakshi

చెన్నై: భారత క్రికెట్‌లో ధోని, సురేశ్‌ రైనాలది ప్రత్యేక అనుబంధం...కెరీర్‌ ఆరంభంనుంచి రైనాకు ధోని అండగా నిలవగా, వారిద్దరి మధ్య ఆత్మీయతకు క్రికెట్‌ వర్గాలు రామలక్ష్మణులుగా పేరు పెట్టాయి. ఇప్పుడు రైనా కూడా ఆటకు వీడ్కోలు పలికే విషయంలో అన్ననే అనుసరించాడు. నేనూ నీకు తోడుగా వస్తానంటూ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ధోని గుడ్‌బై చెప్పిన కొద్ది సేపటికే అతని సహచరుడు రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘నీతో కలిసి ఆడినంత కాలం ఆప్యాయంగా అనిపించింది ధోని... అభిమానం నిండిన హృదయంతో చెబుతున్నా... నేనూ నీ ప్రయాణంలో భాగం కావాలని నిర్ణయించుకున్నా. థ్యాంక్యూ ఇండియా. జైహింద్‌’ అని సురేశ్‌ రైనా తన రిటైర్మెంట్‌ సందేశాన్ని ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. వచ్చే నెలలో యూఏఈలో జరిగే ఐపీఎల్‌ టి20 టోర్నీలో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తరఫున రైనా ఆడనున్నాడు. 
♦ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల రైనా 2005 జూలై 30న దంబుల్లాలో శ్రీలంకపై తొలి వన్డే ఆడాడు. 2018 జూలై 17న లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై రైనా చివరిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.  

♦ తన 13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టి20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో కలిపి 768 పరుగులు... వన్డేల్లో 5 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలతో కలిపి 5,615 పరుగులు... టి20ల్లో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలతో కలిపి 1,605 పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రైనా ఘనత వహించాడు. చురుకైన ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన రైనా తన కెరీర్‌ మొత్తంలో 167 క్యాచ్‌లు (టెస్టుల్లో 23+వన్డేల్లో 102+టి20ల్లో 42) తీసుకున్నాడు.  

♦ ధోని మాదిరిగానే రైనా కూడా తన అరంగేట్రం వన్డేలో ‘డకౌట్‌’ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని చక్కని ఇన్నింగ్స్‌ ఆడి జట్టులో నిలదొక్కుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టులో రైనా సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో (28 బంతుల్లో 34 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌); పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో (39 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు) రైనా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

♦ తన అంతర్జాతీయ కెరీర్‌లో రైనా వన్డేల్లో రెండుసార్లు (2013లో ఇంగ్లండ్‌పై; 2014లో ఇంగ్లండ్‌పై)... టి20ల్లో ఒకసారి (2010లో జింబా బ్వేపై) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు గెల్చు కున్నాడు. వన్డేల్లో 12 సార్లు... టి20ల్లో మూడు సార్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారాలు అందుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement