టైటిల్ పోరుకు సానియా జంట
బ్రిస్బేన్: కొత్త సీజన్‌ను టైటిల్‌తో ఆరంభించేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో విజయం దూరంలో నిలిచింది. బ్రిస్బేన్ ఓపెన్‌లో తన భాగస్వామి బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలసి ఈ హైదరాబాదీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా–బెథానీ ద్వయం 6–4, 6–3తో సు వీ సెయి (చైనీస్ తైపీ)–లారా సిగెమండ్ (జర్మనీ) జంటపై గెలిచింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ తమ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. శనివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ ఎకతెరీనా మకరోవా–ఎలీనా వెస్నినా (రష్యా) జోడీతో సానియా ద్వయం తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మకరోవా–వెస్నినా 6–1, 6–3తో మూడో సీడ్ కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) –అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)లపై గెలిచారు.
టాప్ ర్యాంక్ ఉంటుందా... లేదా!
గత 91 వారాలుగా ప్రపంచ మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న సానియా మీర్జా బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకుంటే ఆమె పార్ట్‌టైమ్ భాగస్వామి, ప్రస్తుతం ఐదో ర్యాంక్‌లో ఉన్న బెథానీ మాటెక్‌కు టాప్ ర్యాంక్‌ను కోల్పోతుంది. ఫైనల్లో ఓడిపోతే మాత్రం ఈ హైదరాబాద్ స్టార్ నంబర్‌వన్ ర్యాంక్‌లోనే కొనసాగే అవకాశముంది. గతేడాది హింగిస్‌తో కలిసి సానియా ఈ టోర్నీ టైటిల్ నెగ్గగా... బెథానీ ఈ టోర్నీలో ఆడలేదు. ప్రస్తుతం సానియా ఖాతాలో 8,135 పాయింట్లు... బెథానీ ఖాతాలో 7,805 పాయింట్లు ఉన్నాయి. వీరిద్దరి మధ్య 330 పాయింట్ల తేడా ఉంది. టైటిల్ గెలిస్తే ఈ జంటకు 470 పాయింట్లు... రన్నరప్‌గా నిలిస్తే 305 పాయింట్లు లభిస్తాయి. గతేడాది సానియా ఈ టైటిల్ నెగ్గినందుకు ఈసారీ విజేతగా నిలిస్తే ఆమె ఖాతాలో అదనంగా పాయింట్లు చేరే అవకాశం లేదు. బెథానీ గత సంవత్సరం ఈ టోర్నీలో ఆడలేదు కాబట్టి ఆమె ఖాతాలో అదనంగా పాయింట్లు వస్తాయి. దాంతో ర్యాంకింగ్స్‌లో మార్పు వస్తుంది.