
బెంగళూరు: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది ఆఖర్లో బరిలోకి దిగే అవకాశముందని సూచనప్రాయంగా చెప్పింది. 32 ఏళ్ల హైదరాబాదీ ప్రస్తుతం తన చిన్నారితో ‘అమ్మతనాన్ని’ ఆస్వాదిస్తోంది. ఆమె చివరిసారిగా 2017 అక్టోబర్‌లో చైనా ఓపెన్‌లో ఆడింది. అక్కడే మోకాలి గాయంతో ఆటకు దూరమైంది. తదనంతరం గర్భం దాల్చడంతో గత ఏడాదంతా రాకెట్ పట్టలేదు. అయితే త్వరలో శారీరక శిక్షణ అనంతరం రాకెట్ పడతానని చెబుతోంది. మీడియాతో ఆమె ముచ్చటిస్తూ ‘ఈ ఏడాది చివర్లో బరిలోకి దిగుదామని భావిస్తున్నా. నా కండిషనింగ్ ట్రెయినర్ మరో పదిరోజుల్లో ఇక్కడికి వస్తున్నాడు. ముందైతే బరువు తగ్గుతాను. టెన్నిస్ శిక్షణకు అవసరమైన ఫిట్‌నెస్ సాధిస్తాను. నా వయసు 32 ఏళ్లు.
నేనిప్పుడు యువ టెన్నిస్ క్రీడాకారిణేం కాదు. కానీ టెన్నిసే నా జీవితం. నేను ఆ దిశగా ప్రయత్నించకపోతే ప్రాణం పోయినట్లే కదా! ఆట నాకెంతో ఇచ్చింది. ఆ ఆట నాలో ఇంకా మిగిలే ఉందేమో చూద్దాం’ అని చెప్పుకొచ్చింది. తనకు టెన్నిస్ దిగ్గజం స్టెఫీ గ్రాఫే స్ఫూర్తి అని, వివాహమయ్యాక... తల్లి అయ్యాక కూడా స్టెఫీ గ్రాఫ్ విజయవంతంగా కెరీర్‌లో దూసుకెళ్లిందని సానియా వివరించింది. తను ఈ క్రీడలో రాణించేలా తల్లిదండ్రులతో పాటు భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి ప్రోత్సహించారని తెలిపింది. భారత్‌లో ప్రజాదరణ విషయంలో క్రికెట్‌తో టెన్నిస్ ఎప్పటికీ పోటీపడలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment