
సిడ్నీ ఓపెన్ సానియా జోడీదే...
♦ వరుసగా 30 మ్యాచ్‌లు గెలిచిన సానియా-హింగిస్
♦ సిడ్నీ ఓపెన్ కైవసం చేసుకున్న ఇండో-స్విస్ ద్వయం
సిడ్నీ: డబుల్స్ నెంబర్ వన్ జోడీ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)లు సిడ్నీ ఇంటర్నేషనల్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో కరోలిన్ గార్సియా-క్రిస్టినా మ్లడనోవిక్ జంటపై 1-6, 7-5, 10-5 తేడాతో సానియా, హింగిస్ విజయం సాధించారు. సుమారు గంట 13 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రత్యర్థి జంటపై గెలిచి వరుసగా 30వ గెలుపును తమ ఖాతాలో వేసుకున్నారు. తొలి సెట్ గార్సియా-క్రిస్టినా ద్వయానికి కోల్పోవడం, రెండో సెట్లో 1-4తేడాతో వెనకుంజలో ఉన్నా టాప్ సీడ్ ఏ దశలోనూ తమ పోరాట పటిమను వీడలేదు.
టై బ్రేకర్లో పాయింట్ సాధించి రెండో సెట్ గెలిచిన సానియా జోడీ మూడో సెట్లోనూ ప్రత్యర్థి జంట నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తంగా ఈ జోడికిది 11వ మిక్స్డ్ డబుల్స్ టైటిల్. కాగా, సిడ్నీ ఓపెన్ ఈ ఏడాది వీరికి రెండో టైటిల్. 1990లో జానా నవోత్నా-ఎలీనా సుకోవా నెలకొల్పిన 44 మ్యాచ్‌ల రికార్డును ఛేదించాలంటే సానియా జోడి ఇంకా 15 మ్యాచ్‌లు నెగ్గాల్సి ఉంటుంది.