ముర్రే జోడిపై బోపన్న జంట విజయం
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్లో నాలుగో సీడ్, భారత టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ జోడీ సానియా మీర్జా-రోహన్ బోపన్నలు సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా జంట 6-4, 6-4 తేడాతో ఆండీ ముర్రే- హీతర్ వాట్సన్ ద్వయం(బ్రిటన్)పై గెలిచి సెమీస్ కు చేరింది. ఈ మ్యాచ్ లో సానియా జోడి ఏమాత్ర తడబాటు లేకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సానియా జోడి పతకాన్ని సాధించేందుకు అడుగుదూరంలో నిలిచింది. ఈ ద్వయం ఫైనల్ కు చేరితే కనీసం రజతాన్ని తమ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సెమీస్ లో నిష్క్రమిస్తే మాత్రం కాంస్య పతకం కోసం మరో ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది.
ఒలింపిక్స్ చరిత్రలో భారత టెన్నిస్ ఈవెంట్లో ఇప్పటివరకూ ఒక పతకాన్ని మాత్రమే చేజిక్కించుకుంది. భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ 1996 అట్లాంటా ఒలింపిక్స్లో భారత్ కు కాంస్య పతకాన్ని సాధించాడు. దీంతో భారత్ చరిత్రను మరోసారి తిరగరాసేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ విజయంపై లియాండర్ పై బోపన్న జోడికి అభినందలను తెలియజేశాడు.