సానియాకు ఇచ్చినట్లే మిగతా క్రీడాకారులకు ఇవ్వాలి
టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
ఎల్బీ స్టేడియం: రాష్ట్రంలోని క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగావకాశాలు రాకపోవడం విచారకరమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, అంబర్‌పేట్ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (టీకేఏ) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం టీకేఏ చైర్మన్ అయిన జి.కిషన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్నిస్ క్రీడాకారిణి సానియాకు ఇచ్చిన భారీ నజరానాను ఇతర క్రీడాకారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు, కోచ్‌లకు ఉపాధి కల్పించగలమనే భరోసా ప్రభుత్వం ఇవ్వాలని ఆయన కోరారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు తమ స్పానర్‌షిప్ కోసం రాజకీయ పార్టీల ఆఫీసులు, ఎమ్మెల్యేల చుట్టు తిరిగే అవసరం లేకుండా చూడాలన్నారు.
అలాగే రాష్ట్రంలోని పార్టీలు రాజకీయాలకు అతీతంగా క్రీడాకారులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ మాట్లాడుతూ నేడు ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని అందిస్తున్న కబడ్డీని ఒలింపిక్ క్రీడల్లో చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.