
వివాదంలో సర్దార్ సింగ్
లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బ్రిటిష్ హాకీ ప్లేయర్ ఆరోపణ
న్యూఢిల్లీ: భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. రెండేళ్ల కిందట తనతో నిశ్చితార్థం చేసుకొని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని భారత సంతతికి చెందిన బ్రిటిష్ హాకీ ప్లేయర్ అష్‌పాల్ కౌర్... సర్దార్‌పై లూథియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని గతేడాది బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది. అప్పట్నించి పెళ్లి మాట ఎత్తితే బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా ఇద్దరికీ పరిచయం అయ్యిందని, అదే ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని క్రీడాకారిణి తెలిపింది.
అప్పట్నించి కలిసి జీవిస్తున్నామని చెప్పింది. అయితే అష్‌పాల్ చేసిన ఆరోపణలను సర్దార్ సింగ్ ఖండించాడు. క్రీడాకారిణితో పరిచయం ఉన్న మాట వాస్తవమే అయినా... తామిద్దరికి ఎలాంటి నిశ్చితార్థం జరగలేదని స్పష్టం చేశాడు. ఆమె తనపై చేస్తున్న ఆరోపణలకు త్వరలోనే సమాధానమిస్తానన్నాడు. ‘ఆ అమ్మాయి నాపై చాలా సీరియస్ ఆరోపణలు చేస్తోంది. సరైన సమయంలో వాటన్నింటికీ సమాధానం ఇస్తా. ప్రస్తుతం నేను హాకీ ఇండియా లీగ్ మ్యాచ్‌లపై దృష్టి పెట్టా. మంగళవారం రాత్రి మ్యాచ్ తర్వాత ఈ ఆరోపణలు నా దృష్టికి వచ్చాయి. గురువారం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. దాని తర్వాత మా లాయర్‌తో సంప్రదించి జవాబిస్తా’ అని సర్దార్ సింగ్ వ్యాఖ్యానించాడు.