సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ అండర్–23 క్రికెట్ టోర్నమెంట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో కుదురుకుంది. ఓపెనర్లు కె. నితీశ్ రెడ్డి (316 బంతుల్లో 123 బ్యాటింగ్; 17 ఫోర్లు), జీఏ శశిధర్ రెడ్డి (306 బంతుల్లో 132; 15 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుత సెంచరీలతో ఆకట్టుకోవడంతో జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 52/0తో ఆట మూడో రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ ఆటముగిసే సమయానికి 107 ఓవర్లలో 3 వికెట్లకు 290 పరుగులతో నిలిచింది.
ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ నితీశ్ రెడ్డి, శశిధర్ రెడ్డి ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో హైదరాబాద్ ప్రస్తుతానికి 220 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 261 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత ఆదిత్య బౌలింగ్‌లో శశిధర్ రెడ్డి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన అభిరత్ రెడ్డి (11), విఠల్ అనురాగ్ (1) విఫలమయ్యారు. ప్రస్తుతం నితీశ్ రెడ్డితో పాటు చందన్ సహాని (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఆదిత్య 3 వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 65.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. చందన్ సహాని (71; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. శశిధర్ రెడ్డి (47; 6 ఫోర్లు, 1 సిక్స్), విఠల్ (32; 6 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఎంబీ దర్శన్ 7 వికెట్లతో చెలరేగాడు. అనంతరం కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 82.4 ఓవర్లలో 249 పరుగులు చేసింది. దీంతో కర్ణాటకకు 70 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. కిషన్ (73; 10 ఫోర్లు), ఆదిత్య (53; 6 ఫోర్లు), కెప్టెన్ నికిన్ జోష్ (49; 7 ఫోర్లు) ఆకట్టుకున్నారు. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ 8 వికెట్లతో ప్రత్యర్థి పనిపట్టాడు. రాజమణి ప్రసాద్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. నేడు ఆటకు చివరి రోజు.
Comments
Please login to add a commentAdd a comment