ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌–అశ్విని జంట | Satwik-Ashwini Couple At Pre-quarters In Hong Kong Open World Tour | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌–అశ్విని జంట

Published Wed, Nov 13 2019 4:43 AM | Last Updated on Wed, Nov 13 2019 4:43 AM

Satwik-Ashwini Couple At Pre-quarters In Hong Kong Open World Tour - Sakshi

హాంకాంగ్‌: బ్యాడ్మింటన్‌ సీజన్‌లోని చివరి వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ హాంకాంగ్‌ ఓపెన్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప (భారత్‌) జంట శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌–అశ్విని ద్వయం 16–21, 21–19, 21–17తో ప్రపంచ 17వ ర్యాంక్‌ జోడీ నిపిత్‌పోన్‌ ఫువాంగ్‌ఫుపెట్‌–సావిత్రి అమిత్రపాయ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జోడీ రెండో గేమ్‌లో చివరి దశలో వరుస పాయింట్లు సాధించి మ్యాచ్‌లో నిలిచింది. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభంలోనే నాలుగు పాయింట్ల ఆధిక్యం సంపాదించి చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది.

మరో మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) జంట 10–21, 18–21తో మూడో సీడ్‌ దెచాపోల్‌–సప్‌సిరి (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో జాతీయ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారమే జరిగిన క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో తొలుత సౌరభ్‌ వర్మ 21–15, 21–19తో తనోంగ్‌సక్‌ సేన్‌సోమ్‌బూన్‌సుక్‌ (థాయ్‌లాండ్‌)పై... అనంతరం 21–19, 21–19తో లుకాస్‌ క్లియర్‌బౌట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచాడు.

శ్రీకాంత్‌ ముందంజ... 
మరోవైపు భారత స్టార్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ కోర్టులో అడుగు పెట్టకుండానే ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌తో తలపడాల్సిన టాప్‌ సీడ్, ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌) టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌కు వాకోవర్‌ లభించింది. ఈ ఏడాది 10 సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచి ఒకే ఏడాది అత్యధిక సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన షట్లర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన మొమోటా... డిసెంబర్‌ 11 నుంచి 15 వరకు చైనాలో జరిగే సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు ముందు తగిన విశ్రాంతి ఉండాలనే ఉద్దేశంతో హాంకాంగ్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement