రన్నరప్ రుత్విక శివాని
ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: యోనెక్స్ ఇండియా ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ డబుల్ ధమాకా సాధించాడు. అతను పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచాడు. తెలుగమ్మాయి, టాప్‌సీడ్ రుత్విక శివాని రన్నరప్‌తో తృప్తిపడింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్, భారత్‌కే చెందిన రీతుపర్ణ దాస్ 11-7, 8-11, 11-7, 14-12తో గద్దె రుత్విక శివానిని కంగుతినిపించింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ షెట్టి జోడి 8-11, 11-5, 7-11, 11-8, 11-5తో టాప్‌సీడ్ సె ఫె గో-నూర్ ఇజుద్దీన్ (మలేసియా) ద్వయంపై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్ తుదిపోరులో టాప్‌సీడ్ సాత్విక్-మనీష జంట 5-11, 11-8, 12-10, 11-8తో హాంగ్ యి లొ-యి సి చి (మలేసియా) జోడిపై గెలిచింది.
మహిళల డబుల్స్ టైటిల్ పోరులో రుు చింగ్ గో- చివ్ సియెన్ లిమ్ (మలేసియా) జోడి 11-6, 11-7, 6-11, 11-7తో జాయ్స్ చూంగ్- జీ లిన్ లిమ్ (మలేసియా) జంటపై నెగ్గింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ 11-13, 11-3, 11-6, 11-6తో తొమ్మిదో సీడ్ జి జియా లీ (మలేసియా)ను కంగుతినిపించి టైటిల్ చేజిక్కించుకున్నాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సక కార్యక్రమానికి శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎండీ ఎ.దినకర్‌బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి పతకాలు అందజేశారు. ఇందులో చాముండేశ్వరీనాథ్, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.