కోహ్లి, ఎంఎస్‌కే ప్రసాద్, రవిశాస్త్రి(ఫైల్‌ఫొటో)
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీపై మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. మనకున్న క్రికెట్ సెలక్షన్ కమిటీ మికీ మౌస్ సెలక్షన్ కమిటీ అంటూ మండిపడ్డాడు. ఎంఎస్‌కే ప్రసాద్ నేతృత్వంలో పనిచేస్తున్న సెలక్షన్ కమిటీని ఏ అంశాల ఆధారంగా ఎంపిక చేశారంటూ విమర్శలు గుప్పించాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మకు టీ కప్‌లు అందివ్వాలంటే ఈ తరహా సెలక్షన్ కమిటీనే సరైనదేమోనంటూ ఎద్దేవా చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అనుష్క శర్మకు సెలక్టర్లు టీ కప్‌లు ఇచ్చిన విషయాన్ని అందరితో పాటు తాను చూశానంటూ ఫరూక్ విమర్శించాడు.
‘మన సెలక్షన్ కమిటీ ఎంపికకు దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. వారు ఆడింది 10 నుంచి 12 టెస్టులు మాత్రమే. అసలు వరల్డ్‌కప్‌కు వెళ్లిన సెలక్టర్లు ఎవరో కూడా నాకు సరిగ్గా తెలీదు. కానీ వారు భారత జెర్సీలు ధరించడంతో సెలక్టర్లలో ఒకరిగా అనుకున్నా(ఎంఎస్‌కే ప‍్రసాద్‌ను ఉద్దేశిస్తూ). ఈ సెలక్టర్లు కోహ్లి భార్య అనుష్కకు టీ కప్‌లు అందివ్వడం నేను చూశా. నాతో పాటు అంతా చూసి ఉండవచ్చు. అనుష్క శర్మకు టీ కప్‌లు ఇవ్వడం కోసం వారు పని చేశారు’ అని పుణెలోని వెంగసర్కార్ క్రికెట్ అకాడమీని సందర్శించడానికి వెళ్లిన ఫరూక్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సెలక్షన్ కమిటీ తీరును విమర్శించారు.
మన సెలక్షన్ కమిటీలో వెంగసర్కార్ వంటి ఒక ప్రముఖ వ్యక్తి ఉండాల్సిందని పేర్కొన్నాడు. అదే సమయంలో క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ)ను కూడా ఫరూక్ వదిలి పెట్టలేదు. అది ఉపయోగం లేని పరిపాలక కమిటీ అంటూ విమర్శించాడు. అందులోని సభ్యులకు రూ. 3 కోట్లకుపైగా కేటాయించడం ఇంకా పనికి మాలిన చర్యగా ఫరూక్ అభివర్ణించాడు.
Comments
Please login to add a commentAdd a comment