'ఇకనైనా క్రికెట్కు గుడ్ బై చెప్పు'
కరాచీ:ఇటీవల భారత్ లో జరిగిన టీ 20వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శనతో కారణంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయిన ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఇకనైన క్రికెట్ కు గుడ్ బై చెబితే మంచిదని మాజీ లెగ్ స్సిన్నర్ అబ్దుల్ ఖాదిర్ సలహా ఇచ్చాడు. క్రికెట్ జట్టులో పునరాగమనం కోసం ఆఫ్రిది నిరీక్షించడం ఎంతమాత్రం సరైన పని కాదన్నాడు. తన సత్తా చాటుకుని పాక్ క్రికెట్ జట్టులో స్థానం సంపాదిస్తానన్న వ్యాఖ్యలపై ఖాదిర్ స్పందించాడు. క్రికెట్ అనేది ఆఫ్రిది ఖిల్లా కాదనే విషయం గ్రహిస్తే మంచిదన్నాడు.
దీంతో పాటు మరో క్రికెటర్ ఉమర్ అక్మల్ పై కూడా ఖాదిర్ ధ్వజమెత్తాడు. ఉమర్ చేసిన స్వీయ తప్పిదాల కారణంగానే జట్టులో స్థానం కోల్పోయడన్నాడు. ఇదిలా ఉండగా, విదేశీ కోచ్ నియమించాలనే ధోరణితో ఉన్న పీసీబీ సమయాన్ని వృథా చేస్తుందన్నాడు. ఒక విదేశీ కోచ్ కంటే స్థానిక కోచ్ అయితేనే ఆటగాళ్ల గురించి ఎక్కువ తెలిసి ఉంటుందన్నాడు. ఒకవేళ విదేశీ కోచ్నే నియమించాలనుకుంటే మాత్రం వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ కంటే మెరుగైన ఆప్షన్ లేదని పీసీబీకి ఖాదిర్ సూచించాడు.