భారీగా మెరుపులు, విధ్వంసకర బ్యాటింగ్ కనిపించలేదు కానీ మ్యాచ్ ఆసాంతం మన ఆధిపత్యం కొనసాగింది. ఏ ఒక్కరి ప్రదర్శనపైనో కాకుండా సమష్టిగా టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. ముందుగా పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి కట్టడి, ఆపై సాఫీగా సాగిన బ్యాటింగ్‌తో అలవోకగా కివీస్ పని పట్టింది. గత ఓటమి నుంచి వెంటనే పాఠాలు నేర్చుకొని సిరీస్ చేజారిపోకుండా చూసుకుంది. దాదాపు 12 వేల మంది భారత ప్రేక్షకుల మద్దతుతో ఈడెన్ పార్క్ మన ఈడెన్ గార్డెన్స్‌లా కనిపించిన చోట తొలిసారి న్యూజిలాండ్ గడ్డపై టి20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా, ఖలీల్... బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, రిషభ్ పంత్ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌ను భారత్ 1–1తో సమం చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కొలిన్ గ్రాండ్‌హోమ్ (28 బంతుల్లో 50; 1 ఫోర్, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, రాస్ టేలర్ (36 బంతుల్లో 42; 3 ఫోర్లు) రాణించాడు.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (3/28), ఖలీల్ అహ్మద్ (2/27) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (29 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో పాటు రిషభ్ పంత్ (28 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), శిఖర్ ధావన్ (31 బంతుల్లో 30; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే నిర్ణాయక మూడో టి20 మ్యాచ్ రేపు హామిల్టన్‌లో జరుగుతుంది.
గ్రాండ్‌హోమ్ అర్ధ సెంచరీ...
గత మ్యాచ్ హీరో, ఓపెనర్ సీఫెర్ట్ (12)ను భారత పేసర్లు భువనేశ్వర్, ఖలీల్ ఆరంభంలో బాగా ఇబ్బంది పెట్టారు. ఒత్తిడికి గురైన అతను భువీ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్‌తో ఎదురుదాడికి ప్రయత్నించినా తర్వాతి బంతికే వెనుదిరిగాడు. అనంతరం కృనాల్ తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో కివీస్‌ను దెబ్బ తీశాడు. ముందుగా మున్రో (12), ఆ తర్వాత మిషెల్ (1) ఔటయ్యారు. తన తర్వాతి ఓవర్లోనే కీలకమైన విలియమ్సన్ (17 బంతుల్లో 20; 3 ఫోర్లు) వికెట్ తీసి కృనాల్ ప్రత్యర్థి పని పట్టాడు. ఈ దశలో గ్రాండ్‌హోమ్, టేలర్ 47 బంతుల్లో 77 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు.
ముఖ్యంగా దూకుడు ప్రదర్శించిన గ్రాండ్‌హోమ్ ముందుగా చహల్ ఓవర్లో వరుసగా 6, 4, 6 బాది... కృనాల్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా మరో రెండు సిక్సర్లతో చెలరేగాడు. 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అతడిని హార్దిక్ సాగనంపాడు. కొద్ది సేపటికి విజయ్ శంకర్ డైరెక్ట్ త్రోతో టేలర్ రనౌట్ కాగా... ఆఖరి ఓవర్లో ఖలీల్ 5 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చివరి ఐదు ఓవర్లలో కివీస్ కేవలం 2 ఫోర్లతో 37 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పంత్ మెరుపులు...
ఓపెనర్లు రోహిత్, ధావన్ శుభారంభం ఇవ్వడంతో ఛేదనలో భారత్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. వీరిద్దరు తొలి వికెట్‌కు 56 బంతుల్లో 79 పరుగులు జోడించారు. కుగ్‌లీన్ ఓవర్లో రోహిత్ వరుసగా 4, 6 కొట్టగా, సౌతీ వేసిన తర్వాతి ఓవర్లో ధావన్ రెండు ఫోర్లు బాదాడు. మరో రెండు భారీ సిక్సర్ల అనంతరం 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ చివరకు సోధి బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
ఆ తర్వాత తక్కువ వ్యవధిలో జట్టు ధావన్, విజయ్ శంకర్ (14) వికెట్లు కోల్పోయింది. అయితే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పంత్ చక్కటి షాట్లతో చకచకా పరుగులు సాధించాడు. ముఖ్యంగా సౌతీ బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా అతను ఒంటి చేత్తో కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. మరో ఎండ్‌లో ధోని (17 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్) అండగా నిలవడంతో భారత్ సునాయాసంగా విజయం దిశగా సాగిపోయింది. కుగ్‌లీన్ బౌలింగ్‌లో పంత్ కొట్టిన ఫోర్‌తో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే భారత్ గెలిచింది.
రోహిత్ ‘టాప్’
అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్‌శర్మ నిలిచాడు. 92 మ్యాచ్‌లలో 2,288 పరుగులు చేసిన రోహిత్... మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్–2272)ను అధిగమించాడు.
Comments
Please login to add a commentAdd a comment