ఇంగ్లండ్... మంచి జట్టనే ముద్రతో ఎన్నోసార్లు ప్రపంచ కప్ బరిలో దిగింది. కానీ 1966లో చాంపియన్‌గా నిలవడం, 1990లో సెమీస్ చేరడం తప్ప మిగతాదంతా సాదాసీదా ప్రదర్శనే. ఇప్పుడు సైతం భారీ అంచనాల్లేకుండానే వచ్చింది. అయితే, ఒక్కో మ్యాచ్ గట్టెక్కుతూ కప్‌నకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. హ్యారీ కేన్‌లాంటి యువ సారథి ఆధ్వర్యంలో 52 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సువర్ణావకాశం ముందుంది.
క్రొయేషియా... పెద్ద విశ్లేషణలు కూడా అవసరం లేని జట్టు. 1998లో అరంగేట్రంలోనే మూడో స్థానంలో నిలిచినా, తర్వాత కనీసం గ్రూప్ దశ దాటలేదు. ఈసారి మాత్రం లూకా మోడ్రిక్ సారథ్యంలో అసాధారణ పోరాటంతో ఆకట్టుకుంటోంది. లీగ్ దశలో అర్జెంటీనా లాంటి జట్టునే 3–0తో చిత్తుగా ఓడించింది. ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్‌లో పెనాల్టీ షూటౌట్లను తట్టుకుని మరీ సెమీస్ గడప తొక్కింది. మరో రెండు అడుగులు దిగ్విజయంగా వేస్తే చాలు... పట్టుమని 40 లక్షల జనాభా అయినా లేని తమ చిన్న దేశం కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తుంది.
... బుధవారం అర్ధరాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో, చరిత్రకు చేరువలో ఉన్న ఈ రెండు జట్లలో ఏది నెగ్గుతుందో చూద్దాం.!
మాస్కో: ప్రస్తుత ప్రపంచకప్‌లో టాప్ గోల్ స్కోరర్, ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ వయసు 24 ఏళ్లు. తమ జట్టు చివరిసారిగా ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆడినపుడు అతడు పుట్టనే లేదు. కేన్ ఒక్కడే కాదు జట్టులోని 23 మందిలో 17 మంది ఆటగాళ్లు 1990 తర్వాత జన్మించినవారే. ఇప్పటికే ఇంగ్లండ్‌ను సెమీస్ చేర్చి తమ ప్రత్యేకత చాటుకుందీ నవతరం. సంచలనాల క్రొయేషియాతో బుధవారం జరిగే సెమీఫైనల్లో నెగ్గితే చరిత్ర సృష్టించే అవకాశం ముంగిట నిలుస్తుంది. మరోవైపు ఆఖరి క్షణం వరకు పోరాడుతున్న క్రొయేషియాకూ ఇదో మహదవకాశమే. లీగ్ దశలో అజేయంగా నిలిచి... ‘పెనాల్టీ నాకౌట్’లను తట్టుకుని 20 ఏళ్ల తర్వాత సెమీఫైనల్లో అడుగిడిందీ జట్టు. ఈ నేపథ్యంలో విజయం కోసం ఇరు పక్షాల మధ్య హోరాహోరీ సమరం ఖాయంగా కనిపిస్తోంది.
ఆ ‘హరికేన్’ను నిలువరిస్తేనే...
ఓ పద్ధతి ప్రకారం ప్రత్యర్థుల శిబిరంలోకి చొచ్చుకెళ్లి గోల్స్ చేస్తూ మ్యాచ్‌లను గెలుస్తోంది ఇంగ్లండ్. చివరి లీగ్ మ్యాచ్‌లో బెల్జియంపై పరాజయం, ప్రిక్వార్టర్స్‌లో కొలంబియాపై పెనాల్టీ షూటౌట్‌లో నెగ్గినా, క్వార్టర్స్‌లో స్వీడన్‌ను తేలిగ్గా ఓడించింది. దాడులను ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ హ్యారీ కేన్ జట్టుకు పెద్ద బలం. ఇతడికి లిన్‌గార్డ్, డెలె అల్లీ తోడైతే ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు. అయితే, ఇప్పటివరకు ఇంగ్లండ్ ప్రత్యర్థికి కనీసం ఒక గోల్ అయినా ఇస్తూ వస్తోంది. కొలంబియాతో మ్యాచ్‌లో కేన్ ఆధిక్యం సాధించి పెట్టినా, చివరి క్షణాల్లో ఆధిక్యం చేజార్చుకుని ఇబ్బంది పడింది. క్రొయేషియాకు ఇదే విధంగా అవకా శం ఇస్తే కోలుకోవడం కష్టమవుతుంది. కేన్‌ను ప్రత్యర్థులు నిలువరిస్తే... లిన్‌గార్డ్, మగ్యురె, అల్లీ బాధ్య తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వారిద్దరితోనే ప్రమాదం...
సాకర్ సమరంలో క్రొయేషియా ఇక్కడి వరకు వచ్చిందంటే కెప్టెన్ లూకా మోడ్రిక్, ఇవాన్ రాకిటిక్‌ల అసాధారణ ఆటే కారణం. ముఖ్యంగా మోడ్రిక్ దూకుడుకు అర్జెంటీనానే బెంబేలెత్తింది. ఇతడికి రాకిటిక్ నుంచి చక్కని సహకారం అందుతోంది. అటాకింగ్ మిడ్ ఫీల్డర్లయిన వీరు అద్భుత సమన్వయంతో గోల్స్ చేయడంతో పాటు స్ట్రయికర్ల పనిని సులువు చేస్తున్నారు. దీంతో జట్టుకు అదనపు బలం చేకూరుతోంది. వరుసగా రెండో పెనాల్టీ షూటౌట్‌లోనూ నెగ్గిన జట్టు తమ పోరాటతత్వం ఏ స్థాయిలో ఉందో చాటింది. అయితే తీవ్ర ఒత్తిడిలో ఆటగాళ్లు మానసికంగా అలసిపోయి సెమీస్‌లో ఇదే ప్రతిబంధకంగా మారే ప్రమాదం కూడా ఉంది.
సెమీస్ చేరాయిలా...
క్రొయేషియా
నైజీరియాపై 2–0తో గెలుపు
అర్జెంటీనాపై 3–0తో విజయం
ఐస్‌లాండ్‌పై 2–1తో గెలుపు
ప్రిక్వార్టర్స్‌లో డెన్మార్క్‌పై షూటౌట్లో 3–2తో గెలుపు
క్వార్టర్స్‌లో రష్యాపై షూటౌట్లో 4–3తో గెలుపు
ఇంగ్లండ్
ట్యునీషియాపై 2–1తో గెలుపు
పనామాపై 6–1తో విజయం
బెల్జియం చేతిలో 0–1తో పరాజయం
ప్రిక్వార్టర్స్‌లో కొలంబియాపై షూటౌట్లో 4–3తో గెలుపు
క్వార్టర్స్‌లో 2–0తో స్వీడన్‌పై జయభేరి
Comments
Please login to add a commentAdd a comment